Telangana Elections 2023: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ ఫ్యామిలీ కరెంట్ ఊడగొడుతం: రేవంత్ రెడ్డి ఫైర్
TPCC Chief Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ (Telangana CM KCR) ఫ్యామిలీ కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ ల కరెంట్ ఊడగొడుతం అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
Congress Vijayabheri Sabha: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ (Telangana CM KCR) ఫ్యామిలీ కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ ల కరెంట్ ఊడగొడుతం అన్నారు. వర్ధన్నపేట్ లో జరిగిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కాదని, ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ఎవడిపాలైంది, ఇప్పుడు ఎవడేలుతున్నడు అని ప్రశ్నించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములు గుంజుకున్న వ్యక్తి ఇక్కడి ఎమ్మెల్యే, అదేమని ప్రశ్నించిన వారిని పోలీస్ బూటు కాలితో తన్నించిన వ్యక్తి అరూరి రమేష్ అని పేర్కొన్నారు.
ఎన్నికలు వస్తున్నాయనే ల్యాండ్ పూలింగ్ జీవోను తాత్కాలికంగా ఆపారని రేవంత్ రెడ్డి చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు అని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చెప్పిండు. కానీ కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు (Kaleshwaram Lift Irrigation Project) పూర్తి కాకముందే మేడిగడ్డ కుంగింది, అన్నారం పగిలింది.. సిందిళ్లకు దిక్కులేదు అని బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. లక్ష కోట్లు దిగమింగి పేక మేడలు కట్టిండు. బుద్ది ఉన్నవాడు ఎవడైనా ఇసుకపై బ్యారేజీ కడతాడా అని కేసీఆర్ ను నిలదీశారు. నిజంగా ప్రమాదంతోనే ప్రాజెక్టు కూలితే.. ప్రజలకు ఎందుకు చూపించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఓట్లు వేసి బీఆరెస్ ను గెలిపిస్తే ఆ జీవోనే మీ మెడ మీద కత్తిగా మారి వేలాడుతుంది. స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి కోసం తెలంగాణ తెచ్చుకున్నం. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ దొర కాళ్ల కింద నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గజ్వేలో లో కేసీఆర్ గడీ!
గజ్వేల్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వంద గదులతో గడీని నిర్మించుకుండని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జన్వాడలో 100 ఎకరాలలో కోట్లు ఖర్చు పెట్టి కేటీఆర్ ఒక గడీని కట్టుకున్నారు. కానీ ధనిక రాష్ట్రంలో ప్రతీనెలా మొదటి తారీఖు జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కేసీఆర్ అంటుండు.. కాంగ్రెస్ రాగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్, దయాకర్ రావు, కవిత రావు ల కరెంట్ ఊడగొడుతం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ రాగానే.. కేసీఆర్ మీ మోటర్లు కాలుతాయ్, మీ ట్రాన్స్ఫార్మర్స్ పేలుతాయ్ అంటూ హెచ్చరించారు.
చదువురాని దయాకర్ కేసీఆర్ చుట్టం అనే ఒక్క అర్హతతో మంత్రి అయిండని విమర్శించారు. ఈ ఎన్నికలు పోలీసులు దొంగల మధ్య జరుగుతున్న ఎన్నికలు అని, మీరు ఎవరివైపు ఉంటారో తేల్చుకోండి అని ప్రజలకు రేవంత్ రెడ్డి సూచించారు. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
డిప్యూటీ సీఎంలుగా చేసి ఉద్యోగం ఊడగొట్టుకున్నారు!
స్టేషన్ ఘనపూర్ లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక ఆడబిడ్డ ఇక్కడ పోటీ చేస్తుంటే రాజయ్య, శ్రీహరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాజయ్య, శ్రీహరి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరి గురించి మరొకరు ఇప్పటికే నిజాలు బయటపెట్టారంటూ సెటైర్లు వేశారు. ఇద్దరూ ఉప ముఖ్యమంత్రిగా పని చేసి ఉద్యోగం ఊడగొట్టుకున్నోల్లేనని.. సీఎం కేసీఆర్ కే వీళ్లపై నమ్మకం లేదు. ఇంక ప్రజలు ఎలా నమ్ముతారని అడిగారు.
కేసీఆర్ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు. బీఆరెస్ ఆరుగురు మహిళలకు టికెట్లు ఇస్తే.. కాంగ్రెస్ 12 మంది మహిళలకు టికెట్లు ఇచ్చిందన్నారు రేవంత్. సర్పంచులు బిల్లులు రాక ఆత్మహత్య చేసుకుంటుంటే.. మంత్రి దయాకర్ రావు వాళ్లను ఖాళీ సీసాలు అమ్ముకోమంటారా? అని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుంది.. నిరుద్యోగ యువతి ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుంటే.. ఈ ప్రభుత్వం ఆ కుటుంబం పరువును బజారుకీడ్చిందన్నారు.
వంద తప్పులు పూర్తయ్యాక శిశుపాలుడి శిరచ్ఛేదనం జరిగిందని, పాపాల భైరవుడు కేసీఆర్ వంద తప్పులు పూర్తయ్యాయని.. ఈ ఎన్నికల్లో శిరచ్ఛేదనం జరగాల్సిందే.. బీఆరెస్ ప్రభుత్వం నేల కూలాల్సిందే అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. స్టేషన్ ఘనపూర్ లో ఇందిరమ్మను 25వేల మెజారిటీతో గెలిపించాలని కోరారు.