Mulugu News: నన్ను ఓడించడానికి డబ్బు సంచులతో దిగుతున్నారు - సీతక్క సంచలన ఆరోపణలు
ప్రశ్నించే గొంతును అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడానికి పెద్ద కుట్రకు తెరలేపుతున్నారని సీతక్క విమర్శించారు.
ములుగు నియోజకవర్గంలో తనను ఓడించడానికి బీఆర్ఎస్ నేతలు డబ్బుల సంచులతో దిగుతున్నారని అక్కడి ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ప్రజా సేవకు డబ్బు సంచులకు మధ్య యుద్ధం మొదలైందని అన్నారు. తాను ఎక్కడా భూ కబ్జాలకు పాల్పడలేదని అన్నారు. ప్రశ్నించే గొంతు నొక్కడానికే బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మంగళవారం (ఆగస్టు 29) మీడియా సమావేశం నిర్వహించారు. మిడతల దండు తరహాలో బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ మంత్రులకు పక్క నియోజకవర్గాల మీద ఉన్న ప్రేమ తమ నియోజకవర్గాల మీద ఉండటం లేదని అన్నారు.
ప్రశ్నించే గొంతును అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడానికి పెద్ద కుట్రకు తెరలేపుతున్నారని సీతక్క విమర్శించారు. సీతక్క బాగా పని చేస్తుందని అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలే పొగుడుతున్నారని.. కానీ, ఇక్కడికి వచ్చి ఓడించమంటున్నారని అన్నారు. ప్రజల్లో తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక తనను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. ప్రజలే తన కుటుంబం అని, నియోజకవర్గ ప్రజలే తనను ఆశీర్వదిస్తారని అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులంతా దండయాత్రలు చేసి ములుగును భయాందోళనకు గురిచేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి..
కాంగ్రెస్ పార్టీ ములుగు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుతోట చంద్ర మొగిలితో పాటు మరికొందరు ఆదివారం (ఆగస్టు 27) నాడు బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్‌ఎస్ ములుగు అభ్యర్థి బడే నాగజ్యోతి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కన్నాయిగూడెం మండలాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో ములుగు మండలం అబ్బపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ లీడర్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు ఉయ్యాల రాజయ్య గౌడ్ ఆధ్వర్యంలో సర్పంచ్ గండి కల్పన కుమార్, మాజీ ఎంపీటీసీ ఆకుతోట చంద్రమౌళి, ఉప సర్పంచ్ నల్లెల్ల ప్రభాకర్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కంచెం కొమరయ్య, జిల్లెల్ల చిన్నమల్లు, కంచెం కొమరయ్య, బాణాల తిరుపతి, జంగిలి రాజు, చెమ్మల విజేందర్, చెమ్మల సంతు, మోలుగురి మహేష్ చిక్కుల రాజు, కంచెం గట్టయ్య, వంగపల్లి మహేష్, బుస పర్వతాలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఇంకా బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో గ్రామస్థాయి నాయకులు ఉయ్యాల వెంకటేష్, సాయబోయిన మల్లయ్య, గువ్వ రాజు, కంచెం రాజేందర్, సూర లింగ మూర్తి, బొల్ల శంకర్, చొప్పరి నాగరాజు సాయబోయిన మల్లయ్య, జక్కుల తిరుపతి, కంచెం రవి, బుట్టి స్వామి, వంగపల్లి రవి, మామిడిశెట్టి రమేష్, చొప్పరి విజేందర్, యార సురేందర్, బుస చిన్నపర్తి, రాస కుమార్, బస రవి రుద్రబోయిన రాజయ్య తదితరులు ఉన్నారు.