Mangubai Hotel: మంగుబాయి హోటల్ అంటే మామూలుగా ఉండదు - జొన్న రొట్టెలకు చాలా ఫేమనస్ !
Mangubai Hotel: వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటు జొన్నరొట్టెలకు స్పెషల్ హోటల్ గా పేరొందిన ఆదిలాబాద్ మంగుబాయి హోటల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Mangubai Hotel: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎక్స్ రోడ్డు చౌరస్తాలో ఉన్న ఈ రుచికరమైన వంటకాలు లభించే భోజనశాల పేరు మంగుబాయి హోటల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇది సెంటర్ పాయింట్ లో ఉంది. ఉట్నూర్ ఎక్స్ రోడ్ చౌరస్తా నుంచి కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్లే రోడ్లకు మధ్యలో ఉందీ హోటల్. ప్రయాణికులు ఎటువైపు నుంచి వచ్చిన ఈ హోటల్‌కు సమీపానికి చేరుకుంటారు.
ఉట్నూర్ ఎక్స్ రోడ్డు మధ్యలో ఉంది కాబట్టి కచ్చితంగా ఇక్కడ భోజనం చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఇక్కడ భోజన ప్రియులకు మాత్రం మంగుబాయి హోటల్ అంటే చాలా ఫేమస్. మంగుబాయి హోటల్ అంటే తెలియని వారంటూ ఉండరు. మంగుబాయి హోటల్ కి వచ్చే భోజన ప్రియులు కచ్చితంగా జొన్నరొట్టెతో వెరైటీ స్పెషల్ తిని వెళ్తారు. ఇక్కడ వెజ్ లో అన్నం పప్పుతో మూడు రకాల కూరలు ఉంటాయి. నాన్ వెజ్ లో ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది. మటన్, చికెన్, ఎగ్ కర్రీ, ఫిష్, లాంటి స్పెషల్ కర్రీలతో జొన్నరొట్టే ఉంటుంది. అతిగా జొన్నరొట్టెను లాగించేస్తారు భోజన ప్రియులు.
రొట్టెలతో అదిరిపోయే వెజ్ అండ్ నాన్ వెజ్ వంటకాలు..
మంగుబాయి హోటల్ లో ఎక్కువగా వచ్చే భోజన ప్రియులు జొన్నరొట్టెను అతిగా ఇష్టపడి తింటారు. జొన్నరొట్టె రుచిగా రావడానికి కారణం ఏంటంటే జొన్నలను దుకాణాల్లో కొని తెచ్చాక వాటిని చాటలో ఏరి అనంతరం గిర్నిలో పట్టించి స్వచ్ఛమైన ఆ జొన్న పిండితో రొట్టెలను తయారు చేస్తారు. జొన్న రొట్టెతోపాటు స్పెషల్ కర్రీలను తింటూ భోజన ప్రియులు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఆహా.. ఏమి రుచి, భలేగా ఉంది కదూ. సూపర్ టేస్టీ అంటూ భోజన ప్రియులు లాగించేస్తూ చెబుతుంటారు.
వెజ్ ప్రియులు, నాన్ వెజ్ ప్రియులు ఎవరైనా సరే జొన్నరొట్టెలతోనే అతిగా తింటున్నారు. ఈ హోటల్ చిన్నదైనా ఆకలికి రుచికి చాలా పెద్దదని భోజన ప్రియులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఆయా జిల్లాలు రాష్ట్రాల నుంచి వచ్చే భోజన ప్రియులు సైతం వారు ఎప్పుడైనా సరే ఆదిలాబాద్ జిల్లాకి వస్తున్నారంటే కచ్చితంగా మంగుబాయి హోటల్లో భోజనం చేసి వెళతారని, కొంతమంది భోజన ప్రియులు ఇతర జిల్లాల నుంచి వచ్చి పార్సిళ్లను సైతం తీసుకెళుతున్నారని వివరిస్తున్నారు.
హోటల్ వల్ల వచ్చే ఆదాయంతోనే కూతుళ్లకు పెళ్లిళ్లు..
మంగుబాయి హోటల్ గత ఇరవై ఏళ్లుగా నడుస్తోంది. ఉట్నూర్ ఎక్స్ రోడ్డులో ఉండే లింగోజీ నాయక్, మంగుబాయి చిన్న కొట్టులో మంచి భోజనాలు వడ్డించి పెడుతూ ఉపాధి పొందుతోంది. నలుమూలల నుంచి వచ్చే గ్రామస్థులు, ప్రయాణికులకు భోజనం తినడానికి ఆసరగా ఉండటంతో కొంత స్థలం ఇచ్చారు. అప్పటి నుంచి మంగుబాయి ఈ స్థలంలో రేకులు వేసుకొని ఇక్కడ హోటల్ ఏర్పాటు చేశారు. మంగుబాయికి ఓ భర్త, కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇందులో పెద్ద కూతురుకి, కుమారుడికి ఇద్దరికి పెళ్లిళ్లు చేశారు. మరో కూతురు చదువుకుంటూ హోటల్ లో ఆసరగా నిలుస్తోంది. వీళ్లంతా కలిసే ఉంటారు. ఉమ్మడి కుటుంబం వీరిది. మంగుబాయి హోటల్ ని నడిపిస్తూ ఇద్దరికి పెళ్లిళ్లు చేశారు. ఇంకా ఓ కూతురు పెళ్లికి రెడీగా ఉంది. ఇలా తన జీవన ప్రయాణాన్ని మంగుబాయి హోటల్ ద్వారానే కొనసాగిస్తోంది. హోటల్ ద్వారా వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని పోషిస్తోంది.
హోటల్ కి వచ్చే భోజన ప్రియులకు ఇంట్లో వారిలా మర్యాదలు చేస్తూ.. ఇంట్లో వడ్డించినలాగే భోజనాన్ని కూడా పెడుతోంది. ఇక్కడ రుచికరమైన వంటకాలతో జొన్నరొట్టె స్పెషల్ అంటే అందరికీ చాలా ఇష్టం. జొన్నరొట్టె స్పెషల్ తో వెరైటీ కూరలను భోజన ప్రియులు ఆరగించి మంగుబాయికి కృతజ్ఞతలు తెలుపుతూ వెళ్తుంటారు. మంగుబాయి చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరినీ గౌరవిస్తూ తన హోటల్ ని నడిపిస్తోంది. పేద ప్రజలు ఎవరైనా వస్తే వారి వద్ద డబ్బులు లేకున్నా వారికి భోజనం పెట్టి పంపిస్తోంది. ఇలా గౌరవ మర్యాదల మధ్య రుచికరమైన భోజనాలను అందిస్తూ జొన్నరొట్టె స్పెషల్ లాంటి వంటకాలతో మంగుబాయి హోటల్ జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.