Bayyaram Cheruvu: బయ్యారం చెరువు కట్ట తెగిందా? ప్రజలు ఆందోళన చెందవద్దంటూ ఎస్పీ కీలక ప్రకటన
Telangana Rains | మహబూబాబాబాద్ జిల్లాలో భారీగా వర్షం కురిసింది. దాంతో పలు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. బయ్యారం చెరువు కట్ట తెగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రచారం జరుగుతోంది.
మహబూబాబాద్: తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలతో వాగులు, కాలువలు, నదుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం లాంటి పెద్ద ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. తెలంగాణలో ఖమ్మం, కొత్తగూడెం భద్రాద్రి జిల్లా, వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో భారీ వర్షాలకు బయ్యారం చెరువు కట్ట తెగిందని ప్రచారం జరుగుతోంది. చెరువు కట్ట తెగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పోలీసులు స్పందించారు. బయ్యారం చెరువు కట్ట తెగిందన్న వదంతులు నమ్మవద్దని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ సూచించారు.
బయ్యారం చెరువు ప్రస్తుతం లిమిట్ లోనే ప్రవహిస్తుందని తెలిపారు. చెరువు కట్ట తెగిందన్న వార్తల్లో నిజం లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దంటూ ఎస్పీ కీలక ప్రకటన చేశారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు వంకలు నిండి ప్రవహిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. బయ్యారం చెరువు తెగి ప్రవహిస్తుందని వస్తున్న వదంతులు నమ్మకండి. మహబూబాబాద్ జిల్లా అధికారులు ప్రస్తుతం వాగులు, వంకల ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు ప్రవ్యవేక్షిస్తున్నారు. కనుక జిల్లా ప్రజలు అధికారిక ప్రకటనలు మాత్రమే నమ్మాలన్నారు. అంతేగానీ వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా గ్రూప్స్ లో వస్తున్న సమాచారాన్ని విశ్వసించవద్దని సూచించారు.
Also Read: వానలు ఆగాలని చిలుకూరు బాలాజీకి భక్తుల ప్రదక్షిణలు, అర్చకుల ప్రత్యేక పూజలు
అధికారులు అందుబాటులో ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశాలు
ఖమ్మం జిల్లాలో ఐదు రోజుల పర్యటనను ముగించుకుని శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్ వెళ్లారు తెలంగాణ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అయితే శనివారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా పొంగులేటి హుటాహుటిన ఖమ్మం బయలు దేరారు. మున్నేరుకు ముంపు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ వార్నింగ్ తో మంత్రొ పొంగులేటి అప్రమత్తమై ఖమ్మం వెళ్తున్నారు. జిల్లా కలెక్టర్, సీపీ సహా పాలేరు నియోజక వర్గంలోని ఆయా మండలాల అధికారులు అందుబాటులో ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. అవసరం అయితే అర్థరాత్రి సైతం భారీ వర్షాలు, వరద ప్రస్తుత పరిస్థితి పై సమీక్ష చేస్తామన్నారు. అందుకే అధికారులందరూ అలర్ట్ గా ఉండాలని మంత్రి సూచించారు.
Also Read: తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళాలు - పెద్ద మనసుతో ఎవరెవరు ఎంతిచ్చారంటే!