TS Minister Errabelli: ఆయన ఆశీర్వాదం తీసుకున్నాకే నామినేషన్ వేస్తాను: మంత్రి ఎర్రబెల్లి
ప్రతి ముఖ్యమైన విషయాలకు, ఎన్నికల నామినేషన్లకు ముందు ఐనవోలు జాతర ఉత్సవాల్లో పాల్గొంటానని, ఇక్కడ ఆశీర్వాదం తీసుకుంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
వరంగల్ : ప్రముఖ శైవ క్షేత్రంగా పిలిచే ఐనవోలు మల్లికార్జునస్వామి జాతర ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. లక్షలాది మంది భక్తులు భక్తిభావంతో ముద్దుగా పిలుచుకునే మల్లన్న జాతర ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. 2023 మకర సంక్రమణతో ప్రారంభమయ్యే జాతర ఉత్సవాలు ఉగాది వరకు కొనసాగుతాయి. స్వామివారికి దృష్టికుంభం డిసెంబరు 16న (ధను సంక్రమణ) నిర్వహించారు. ధ్వజారోహణము, నూతన వస్త్రాలంకరణ చేయనున్నారు. 14న శనివారం భోగి పండుగ, వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిధులు
సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిధులు ఆలయాలకు అందుతున్నాయన్నారు. కాకతీయ రాజులు ఏ విధంగా అయితే శైవ భక్తులో.. వరంగల్ జిల్లాలో రామప్ప, భద్రకాళి టెంపుల్ ఇలా, ఐనవోలు జాతర కోసం ఏర్పాట్లు ఘనంగా చేశామన్నారు. మా తాతలు, తండ్రులు ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరకు హాజరయ్యేవారు. తాను సైతం ప్రతి ముఖ్యమైన విషయాలకు, ఎన్నికల నామినేషన్లకు ముందు ఐనవోలు జాతర ఉత్సవాల్లో పాల్గొంటానని, ఇక్కడ ఆశీర్వాదం తీసుకుంటానని తెలిపారు. ఈ టెంపుల్ ను ఇంకా డెవలప్ చేయాలని సీఎం కేసీఆర్ ను కోరినట్లు చెప్పారు. ఆలయానికి ప్రత్యేక గ్రాంటు ఇస్తామని చెప్పినందుకు సంతోషంగా ఉందన్నారు. భక్తులకు ఏ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని, భారీ సంఖ్యలో తరలివచ్చి జాతరలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
15వ తేదీన (ఆదివారం) మకర సంక్రాంతి రోజున రాత్రి బండ్లు తిరుగుతాయి. ఆయా జిల్లాల నుంచి వచ్చే భక్తులతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన భక్తులు తరలివస్తారు. 17న సోమవారం మహాసంప్రోక్షణ సమారాధన పూజ కార్యక్రమాలు జరుగుతాయి. 26న గురువారం భ్రమ రాంబిక అమ్మవారి నవమి వార్షికోత్సవం జరుగనుంది. ఫిబ్రవరి 5న ఆదివారం ఎల్లమ్మదేవత పండగ నిర్వహించనున్నారు.
శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాలు
శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 18 నుంచి మార్చి 22 వరకు పాంచాహ్నిక దీక్షతో త్రికుడాత్మకంగా భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వ హించనున్నారు. ఫిబ్రవరి 16న గురువారం సూర్య చంద్ర ప్రభవాహన సేవలు, 17న శుక్రవారం ఆశ్వవా హనసేవ, శేషవాహనసేవ, 18న శనివారం మహాశివ రాత్రి శివ కళ్యా ణం, పెద్దపట్నం, సింహవాహనసేవ, రాత్రి 7 గంటలకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారి కల్యాణం నిర్వహిస్తారు. ఆ తరువాత నంది వాహన సేవ ఉంటుంది. 19న ఆదివారం రావణ వాహనసేవ, రథోత్సవం, పురవీధి సేవ, 20న సోమవారం పర్వతవా హనసేవ నిర్వహిస్తారు. మార్చి 19న ఆదివారం పెద్ద పట్నం కల్యాణం, 22న ఉగాది పండుగ పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు.జనవరి 22 నుంచి మార్చి 19 ఉగాది వరకు వారం తపు జాతరలు ప్రతి ఆది, బుధవారాల్లో జరుగుతాయి.. ఈ యేడు మొత్తం 9 ఆదివారాలు, 9 బుధవారాల వారాంతపు జాతరలు జరగనున్నాయి. జాతరలను లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు.