నిన్న వరద, నేడు బురద- బోరుమంటున్న మోరంచపల్లి వాసులు
కళ్లముందే ముంచేస్తున్న వరద.. ఏం చేయాలో తెలియక మోరంచపల్లిలో హాహాకారాలు వినిపించాయి. 2018 సినిమా అందరికీ కనిపించింది. చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు.
ఈ మధ్య కాలంలో వచ్చిన 2018 సినిమా చూశారా.. అచ్చం అలానే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామాన్ని వరద చుట్టు ముట్టేసింది. అంతా ఆదమరచి నిద్రపోతున్న వేళలో ఒక్కసారిగా ప్రవాహం గ్రామాన్ని కమ్మేసింది. ప్రాణాలు రక్షించుకోవడమే తప్ప వేరే వస్తువు తీసుకు వెళ్లే పరిస్థితి లేకపోయింది. నిద్ర నుంచి లేచే సరికి ప్రజలంతా నీటిలో వస్తువులు కొట్టుకుపోతున్నాయి.
కళ్లముందే ముంచేస్తున్న వరద.. ఏం చేయాలో తెలియక మోరంచపల్లిలో హాహాకారాలు వినిపించాయి. 2018 సినిమా అందరికీ కనిపించింది. చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు. ప్రాణాలను రక్షించుకునేందుకు కుటుంబాలను రక్షించుకునేందుకు పరుగులు పెట్టాల్సి వచ్చింది. కష్టపడి సంపాదించుకున్న వస్తువులన్నింటినీ వదిలేసి ప్రాణాలను అరచేతిలో పట్టుకొని సురక్షిత ప్రాంతాల కోసం వెతుకులాడారు.
అకస్మాత్తుగా ముంచేసిన వరదతో కొందరు మేడపైకి వెళ్లి తలదాచుకుంటే... ఇంకొందరు చెట్లు ఎక్కి ప్రాణాలను రక్షించుకున్నారు. ఇలా తెల్లవార్లు బిక్కుబిక్కుమంటూ భయంతో గడిపారు మోరంచపల్లి వాసులు. బాహ్యప్రపంచానికి విషయం తెలిసి అధికారులు వెళ్లేంత వరకు అంటే దాదాపు 10 గంటల సమయం చెట్లపై, మిద్దెలు, మేడలపై నిల్చొని ఉన్నారు.
సహాయం చేయడానికి వనరులున్నా జోరు వాన అడ్డంకిగా మారింది. వారిని రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పడవలను ఉపయోగించారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో అది వీలు పడలేదు. దీంతో హెలికాప్టర్ సాయంతో వారిని రక్షించే ప్రయత్నం చేశారు. జోరు వానతో హెలికాప్టర్ వెళ్లే పరిస్థితి లేదని అధికారులు తేల్చి చెప్పారు. ఇలా మధ్యాహ్నం వరకు వారికి సాయం అందలేదు.
https://twitter.com/ShivaShakthiOrg/status/1684513212400828417?s=20
చివరకు సీఎం కలుగుచేసుకొని ఆర్మీ సాయం చేసుతున్నారు. ఆర్మీ హెలికాప్టర్లను అక్కడకు పంపించి వారందర్నీ సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఉంచారు.
సుమారు 1500 మంది జనాభా ఉండే గ్రామం మునిగిపోవడంతో జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించారు. ఆ పరిసర ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు ధైర్యం చెప్పారు. పడవల్లో వీలైనంత మందిని రక్షించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
https://twitter.com/AnishettyTweets/status/1684511180038328320?s=20
వరద శాంతించిన తర్వాత గ్రామానికి వెళ్లి అక్కడి పరిస్థితులు చూసిన ప్రజలకు దుఃఖం ఉబికి వస్తోంది. ఊరంతా ఇసుకు మేటలు వేసింది. ఇళ్లంతా బురద మయమయ్యాయి. చాలా వరకు నిత్యవసర వస్తువులు వరదలో కొట్టుకుపోయాయి. ఫర్నీచర్ పూర్తిగా తడిసి పాడై పోయింది. కొంత వరదలో కొట్టుకుపోయింది. తినడానికి తిండి లేదు. కూర్చోవడానికి, పడుకోవడానికి స్థలం లేదని బోరుమంటున్నారు మోరంచపల్లి వాసులు.