Kunamneni Sambasiva Rao: దేశంలో అత్యంత అవినీతి పార్టీ బీజేపీ! ప్రధాని మోదీ జైలుకెళ్లడం ఖాయం: కూనంనేని ఫైర్
CPI Kunamneni Sambasiva Rao: ప్రధాని నరేంద్ర మోదీ ఏదో ఒక రోజు జైలుకెళ్లడం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.
వరంగల్ : దేశంలో అవినీతిపరులకు కొమ్ము కాస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఏదో ఒక రోజు జైలుకెళ్లడం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హనుమకొండలోని హరితా హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తొమ్మిదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో దేశంలో సుమారు 150 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. దేశంలో అత్యంత ప్రమాదకరమైన మతతత్వ, అవినీతికర పార్టీ బీజేపీ అని, బీజేపీ హయాంలోనే విజయ్ మాల్యా, లలిత్ మోడీ నుండి మొదలుకొని ఆదానీ వరకు లక్షల కోట్లు కొల్లగొట్టిన వారేనని అన్నారు.
బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై అవినీతి కేసులు
దేశంలో 58 మంది బీజేపీ ఎంపీలు, 150 మంది ఎమ్మెల్యేలపై అవినీతి కేసులు ఉన్నాయని కూనంనేని తెలిపారు. అయినప్పటికీ వారిపై కేసులు, విచారణలు లేవని, బీజేపీలో చేరితే పునీతులు, లేదంటే సీబీఐ, ఈడీ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో చిన్న చిన్న కుంభకోణాలకే ప్రభుత్వాలు కూలిపోయాయని, నేడు లక్షల కోట్ల అవినీతి జరిగినా పట్టింపు లేదని, చివరకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా పై కేసులున్నా సీబీఐ, ఈడీ పట్టించుకోదని, ఇలాంటి రాజకీయ అవినీతి తిమింగళాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం
ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూలదోసేందుకు రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, నరేంద్ర మోదీ తొమ్మిది ఏండ్ల పాలనలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి వేశారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఎన్నికలు జరుగనున్న డిల్లీ, తెలంగాణ రాష్ట్రాలపై దృష్టి సారించి సిబిఐ, ఈడీలను ప్రయోగిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, డిల్లీ మద్యం కుంబకోణంలో బినామీల పాత్ర ఉందంటూ డిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్నారని అన్నారు. ఇలాంటి రాజకీయ వేధింపులు మానకుంటే మోదీకి కూడా నియంతలకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.
సీపీఐ ఇంటింటికీ పాదయాత్ర
ఢిల్లీ, తెలంగాణ ప్రభుత్వాలు నరేంద్ర మోడీకి లొంగి పోయి వుంటే లిక్కర్ స్కాం ఉండేది కాదని, ఎన్నికలు సమీపిస్తున్నందునే ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలపై కుట్ర చేస్తున్నారని, ప్రతిపక్ష ముక్త్ భారత్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అందుకే బీజేపీ కో హఠావో.. దేశ్ కి బచావో పేరుతో ఏప్రిల్ 14 నుండి మే 18 వరకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో సీపీఐ ఆధ్వర్యంలో ఇంటింటికీ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే జూన్ 1 నుండి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టి జూలై మొదటి వారంలో హైదరాబాద్ లో లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రం నుండి బీజేపీని తరిమి కొట్టడమే తమ లక్ష్యం అని, ఆ పార్టీని రానున్న ఎన్నికలలో సింగిల్ డిజిట్ కు పరిమితం చేస్తామని, బండి సంజయ్ ని కూడా ఎన్నికలలో ఓడిస్తామని అన్నారు.
సీపీఐ, సీపీఎంలు కలిసే ఎన్నికలలో ముందుకు సాగుతాయని, తమకు 119 నియోజకవర్గాలలో బలముందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. అలాగే రాష్ట్రంలో పేదలకు ఇస్తామన్న డబుల్ బెడ్రూం అమలు కాలేదని, దాని స్థానంలో గృహలక్ష్మి పథకం తెచ్చారని, భూమి, ఇల్లు లేని పేదలకే ఈ పథకాన్ని వర్తింప చేయాలని అన్నారు. దళిత బందును కూడా కలెక్టర్ ల ద్వారా పారదర్శకంగా అమలు చేయాలని, జీవో. 59 ప్రకారం పేదల ఇండ్లకు పట్టాలివ్వాలని, పోడు భూములపై సిఎం అసెంబ్లీలో చెప్పిన విధంగా సాగుదారులందరికీ పట్టాలివ్వాలని, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
25 నుండి విభజన హామీలపై ప్రజాపోరు యాత్ర
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25 నుండి ఏప్రిల్ 5 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీపీఐ ప్రజాపోరు యాత్ర నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ సహా రైల్వే పరిశ్రమలు, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, హైదరాబాద్ వరకు ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు, పేదలకు ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని, బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిలిపి వేసి సింగరేణి ఆధ్వర్యంలోనే మైనింగ్ నిర్వహించాలనే డిమాండ్లతో ఈ యాత్రను చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ పాదయాత్రను 25న బయ్యారం లో రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రారంభిస్తారని, ఏప్రిల్ 5న హనుమకొండలో పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగే బహిరంగ సభకు సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లాల కార్యదర్శులు కర్రె బిక్షపతి, మేకల రవి, బి. విజయ సారథి, సిహెచ్ రాజారెడ్డి, కె. రాజ్ కుమార్, తోట మల్లికార్జున రావు, నాయకులు సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రి, మండ సదాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.