(Source: ECI/ABP News/ABP Majha)
Minister KTR : గాంధీ భవన్ లో గాడ్సే, కాలం చెల్లిన కాంగ్రెస్ తో పొత్తుకు ఎవరూ సిద్ధంగా లేరు : మంత్రి కేటీఆర్
Minister KTR : కాలం చెల్లిన కాంగ్రెస్ తో పొత్తుకు ఎవరూ సిద్ధంగా లేరని మంత్రి కేటీఆర్ అన్నారు. సొంత నియోజకవర్గంలో ఎంపీగా గెలవలేని రాహుల్ కాంగ్రెస్ ని ఏం గెలిపిస్తారని ఎద్దేవా చేశారు.
Minister KTR : ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ తో ఎప్పుడూ పొత్తులు పెట్టుకోమని ఆయన తేల్చిచెప్పారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. కాలం చెల్లిన కాంగ్రెస్ పార్టీతో ఎవరూ పొత్తులు పెట్టుకోరని తేల్చేశారు. టీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయన్న రాహుల్ వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. టీఆర్ఎస్ కు ఇతర పార్టీలకు బీ టీమ్, సీ టీమ్ అవ్వాల్సిన పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ప్రజల కోసం పోరాడే టీమ్ టీఆర్ఎస్ అన్నారు. ఇతర పార్టీలకు తొత్తులుగా ఉండే అవసరం టీఆర్ఎస్ కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పేరులోనే స్కామ్ లున్నాయన్నారు. ఎ టు జడ్ అన్ని కుంభకోణాలే అని ఎద్దేవా చేశారు. అగస్టా హెలికాప్టర్, స్పెక్ట్రమ్, బొగ్గు వరకు అన్ని కుంభకోణాలు కాంగ్రెస్ చేసిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
గాంధీ భవన్ లో గాడ్సే
దేశంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొనే వారు ఎవరూ లేవని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కాలం చెల్లిన కాంగ్రెస్‌తో పొత్తుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. తన సొంత నియోజకవర్గంలో ఎంపీగా గెలవలేని రాహుల్ ఇక కాంగ్రెస్‌ను గెలిపిస్తారా అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ గాంధీ భవన్‌ను గాడ్సేకు అప్పగించారన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును రాహుల్ గాంధీ చదివారన్నారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా క్రైసిస్ కమిటీ అన్నారు. రైతుల ఆత్మహత్యలు తక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమే చెప్పిందన్నారు. కాంగ్రెస్ పార్టీ గొప్ప రైతు పార్టీ అయితే పంజాబ్‌లో ఎందుకు ఓడిపోయిందని కేటీఆర్ ప్రశ్నించారు. వరంగల్ డిక్లరేషన్‌లో అసలు కొత్త అంశాలేవన్నారు. 2018లో చెప్పిన విషయాలే రాహుల్ గాంధీ మళ్లీ చెప్పారని విమర్శించారు. ధాన్యం సేకరణపై పార్లమెంటులో రాహుల్ గాంధీ ఎప్పుడూ మాట్లాడలేదన్నారు.
వరంగల్ డిక్లరేషన్ ను నమ్మొద్దు
గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎప్పుడూ నిరంతర విద్యుత్తు లేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏవీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవసాయాన్ని సంక్షోభంగా మారిస్తే సీఎం కేసీఆర్ గొప్ప శక్తిగా మార్చారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ రైతులకు పాతర వేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం జాతర లాంటి వాతావరణాన్ని తీసుకొచ్చిందన్నారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలన్నారు. వరంగల్ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటలను ఎవరూ నమ్మొద్దని కేటీఆర్ పేర్కొన్నారు.