Bandi Sanjay Padayatra : ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయండి, బండి సంజయ్ కు పోలీసులు నోటీసులు!
Bandi Sanjay Padayatra : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు బ్రేక్ పడేలా కనిపిస్తుంది. పాదయాత్రను ఆపాలంటూ పోలీసులు నోటీసులు జారీచేశారు.
Bandi Sanjay Padayatra : తెలంగాణ రాజకీయ రణరంగంగా మారింది. బీజేపీ నేతలు అరెస్టులతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను కరీంనగర్ లోని ఇంటికి తరలించారు. కరీంనగర్ లోని బండి సంజయ్ ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటుచేశారు. ఇంటి చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు తమ నాయకురాలు కవిత ఇంటిపై బీజేపీ నేతల దాడికి నిరసనగా బండి సంజయ్ ఇంటిని ముట్టడించాలనే ఆలోచనలో టీఆర్ఎస్ వర్గాలు ఉన్నట్లు సమాచారం.
పాదయాత్ర ఆపండి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు బ్రేక్ పడేటట్లు కనిపిస్తుంది. పాదయాత్రను ఆపాలంటూ వరంగల్ కమిషనరేట్ నోటీసులు జారీచేసింది. జనగామ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి లేకపోవడం, రెచ్చగొట్టేలా పదే పదే వ్యాఖ్యలు చేయడంతో పాటు ధర్మదీక్ష పేరుతో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలను ఇతర జిల్లాల నుంచి తరలించే ప్రయత్నం చేసినందుకు పాదయాత్ర ఆపాలని నోటీసులు జారీచేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు జనగామ జిల్లా వర్ధన్నపేట అసిస్టెంట్ కమిషనర్ పేరిట నోటీసులు జారీ అయ్యాయి.
యాత్ర కొనసాగించే పక్షంలో చర్యలు
ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని బండి సంజయ్ కు వరంగల్ కమిషనరేట్ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. పాదయాత్రలో పాల్గొన్న ప్రముఖ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ లకు కూడా వర్ధన్నపేట ఏసీపీ నోటీసులు జారీ చేశారు. జనగామ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని నోటీసులో పోలీసులు తెలిపారు. పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని, ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారని పోలీసులు నోటీసుల్లో స్పష్టం చేశారు. రెచ్చగొట్టే ప్రకటనలతో, ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలను రప్పిస్తుండటంతో జిల్లాలో శాంతిభద్రతల విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు. తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరించారు. నోటీసులు పరిగణలోకి తీసుకోకుండా తిరిగి ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తే శాంతిభద్రతల సమస్య కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టంచేశారు.
పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు- బీజేపీ నేతలు
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంగ్రామ యాత్రను ఆపే ప్రసక్తే లేదని బీజేపీ నేతలు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ స్పష్టం చేశారు. పోలీసుల అనుమతితోనే గత మూడు విడతలుగా పాదయాత్ర కొనసాగిస్తున్నామన్నారు. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు? అని ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా? ఎన్ని ఆంక్షలు పెట్టినా పాదయాత్ర కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం భద్రకాళి అమ్మవారి పాదాల చెంత వరకు పాదయాత్ర కొనసాగిస్తామన్నారు. ఈనెల 27న హన్మకొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి తీరుతామన్నారు. పాదయాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకాబోతున్నారని డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ తెలిపారు. బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ను మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు కలవనున్నారు
Also Read : పాదయాత్రలో బండి సంజయ్ అరెస్ట్- జనగామలో హైటెన్షన్
Also Read : Bandi Sanjay : బిస్తర్ పట్టుకుని పాదయాత్రకు వచ్చేయండి - తెలంగాణ యువతకు బండి సంజయ్ పిలుపు !