Minister KTR Comments on Hyderabad Development: 'అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం' - 24 గంటలూ తాగు నీరు, విద్యుత్ అందించడమే లక్ష్యమన్న కేటీఆర్
Hyderabad News: ఉమ్మడి ఏపీలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నామని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నీ అధిగమించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రజలకు నిరంతర విద్యుత్, తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు.
Minister KTR: ఉమ్మడి ఏపీలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని విద్యుత్, తాగునీటి సమస్యలు అధికంగా ఉండేవని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో (Telangana) గతంలో తరచూ విద్యుత్ కోతలు, తాగునీటి కోసం నిరసనలు జరిగేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని చెప్పారు. తొమ్మిదినరేళ్లలో సీఎం కేసీఆర్ (CM kcr) ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చెందామని వివరించారు. హైదరాబాద్‌లో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల (Hyderabad Resident Welfare Association) ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 'అభివృద్ధి నేడు తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉంది. మిషన్ భగీరథ ద్వారా హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా చేశాం. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. హైదరాబాద్‌లో కాలుష్య రహిత ప్రజా రవాణా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. నగరంలో 24 గంటల తాగునీటిని అందించాలన్నదే మా స్వప్నం. మెట్రోను రాబోయే 10 ఏళ్లలో 415 కి.మీ విస్తరించాలన్నదే మా ఎజెండా' అని కేటీఆర్ స్పష్టం చేశారు.
'అది మా బాధ్యత'
మిషన్ భగీరథ ద్వారా భాగ్యనగరం సహా రాష్ట్ర వ్యాప్తంగా తాగు నీటి సమస్య లేకుండా చేశామని, హైదరాబాద్‌లో కాలుష్య రహిత ప్రజా రవాణా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి ఏపీలో సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమించామని వివరించారు. పెట్టుబడులు తేవడం, మౌలిక వసతులు కల్పిస్తేనే విశ్వనగరం సాధ్యమన్న ఆయన మెట్రో రైలు సేవలు మరింత విస్తరించేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రస్తుతం మెట్రో రైలు సేవలు 70 కి.మీ విస్తరించామన్న ఆయన, రాబోయే పదేళ్లలో 415 కి.మీ విస్తరించాలన్నదే తన ప్రధాన ఎజెండా అని అన్నారు. మెట్రో సేవలు ఎక్కువైతేనే ట్రాఫిక్ సమస్య తీరుతుందని తెలిపారు. చెత్త సేకరణలో మరింత సమర్థ నిర్వహణకు చర్యలు తీసుకుంటామని, పురపాలనలో రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌లో పౌరుల భాగస్వామ్యం కల్పించే బాధ్యత తీసుకుంటామని పేర్కొన్నారు.
'గెలుస్తాం.. సమస్యలు తీరుస్తాం'
ప్రజలు పని చేసే ప్రభుత్వాన్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తారని, ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో తాము చేసిన అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తుందని అన్నారు. 'హైదరాబాద్‌లో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయి. అభివృద్ధిలో హైదరాబాద్ న్యూయార్క్ తో పోటీ పడుతుంది. చారిత్రక మహా నగరంగా పేరున్న ఈ భాగ్యనగరాన్ని కాపాడుకోవాలి. గత పదేళ్లలో నగరంలో 36 ఫ్లైఓవర్లు నిర్మించాం, 39 చెరువులను నవీకరించాం. నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గిస్తాం. జీహెచ్ఎంసీకి ఒక కమిషనర్ సరిపోరు. మరో ఇద్దరు ప్రత్యేక కమిషనర్లను నియమిస్తాం. వీరిలో ఒకరు పచ్చదనం, పార్కుల పరిరక్షణకు, మరొకరు చెరువుల పరిరక్షణ చూసే విధంగా చూస్తాం' అని వివరించారు.