TSPSC Paper Leak Case : పేపర్ లీక్ కేసు సీబీఐకి ఇవ్వాలా వద్దా ? హైకోర్టు చెప్పింది ఏమిటంటే ?
పేపర్ లీకేజీ కేసును హైకోర్టు ఏప్రిల్ 11వ తేదీకి వాయిదా వేసింది. కేసును సీబీఐకి ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై ఈ విచారణ జరిగింది.
TSPSC Paper Leak Case : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు స్టేటస్ రిపోర్టు సమర్పించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే స్టేటస్ రిపోర్టు సమర్పించేందుకు సమయం కావాలని అడ్వకేట్ జనరల్ కోరడంతో తదుపరి విచారణను ఏప్రిల్ 11వ తేదీకి వాయిదా వేసింది. పేపర్ లీక్ కేసుపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్ఎస్ యూ రాష్ట్ర ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ హైకోర్ట్ లో వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వాదనలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. పిటిషనర్ల తరపున సుప్రీం అడ్వొకేట్ వివేక్ ఠంకా వాదనలను వినిపించారు.
హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్ తరపున వాదించడానికి వచ్చిన సుప్రీంకోర్టు లాయర్లు
సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని అసలు విచారణ ప్రారంభించగానే మంత్రి కేటీఆర్ నిందితులు ఇద్దరేనని ప్రకటించారని ఇది దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని పిటిషనర్ల తరపు లాయర్ వాదించారు.కేసును సీబీఐకి ఇవ్వాలన్నారు. అయితే అడ్వకేట్ జనరల్ మాత్రం విచారణ పారదర్శకంగా సాగుతోందని విచారణను సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్టేటస్ రిపోర్టును సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. TSPSC పేపర్ లీకేజ్ కేసు నిందితుడు రాజశేఖర్ సతీమణి సుచరిత కూడా కేసును సిబిఐతో విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా డిజిపి, చీఫ్ సెక్రటరీ ,సిట్ , హైదరాబాద్ సిటీ డిసిపి సెంట్రల్ జోన్లను సుచరిత పేర్కొన్నారు. సుచరిత పిటిషన్ ను కూడా ఇదే అంశంపై దాఖలైన పిటిషన్లతో కలిపారు. ఇదే కేసులో హైకోర్టులో నిరుద్యోగులు పిటిషన్ వేశారు.
నాలుగోరోజు నిందితుల్ని ప్రశ్నిస్తున్న సిట్
మరో వైపు నాల్గో రోజు 9 మంది నిందితులను సిట్ విచారిస్తోంది. గ్రూప్ 1 పేపర్ ను ఇంకెవరెవరికి ఇచ్చారనేదానిపై ఆరా తీస్తోంది. విదేశాల నుంచి రప్పించి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినట్లు గుర్తించిన సిట్..వారి వివరాలను సేకరిస్తోంది. అలాగే ఎగ్జామ్ లో 100 కు పైగా మార్కులు వచ్చిన వారి లిస్ట్ ను సిట్ రెడీ చేసింది. నిందితురాలు రేణుక ప్రవీణ్ కు తెలియకుండా మరి కొంతమందికి ఏఈ పేపర్ అమ్మినట్లు సిట్ గుర్తించింది. ఈ క్రమంలో టీఎస్పీఎస్ సీ పేపర్ తీసుకున్న వారిని గుర్తించి వారిపై కేసులు పెట్టనుంది.
రేవంత్ ను ప్రశ్నించేందుకు రెడీ
నిందితుడు రాజశేఖర్ రెడ్డి స్వగ్రామం జగిత్యాల జిల్లా మాల్యాల మండలానికి సిట్ వెళ్లింది. రాజశేఖర్ రెడ్డి మండల పరిధిలో అత్యధిక మందికి గ్రూప్ 1 లో 100 మార్కులకు పైగా వచ్చినట్లు కొందరు రాజకీయ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సిట్ బృందం రాజశేఖర్ రెడ్డి మాల్యాల మండలానికి వెళ్లి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వారి వివరాలను సేకరిస్తోంది. మరో వైప ఈ అంశంపై వ్యాఖ్యలు చేసిన రాజకీయ నేతలకూ సిట్ నోటీసులు జారీ చేసింది. తాము చేసిన రాజకీయ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని ఆదేశిచింది.