Break Fast Menu: తెలంగాణ బడి పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ మెనూ ఖరారు - రేపటి నుంచే మొదలు
పొద్దున్నే పిల్లలకు వడ్డించే బ్రేక్ ఫాస్ట్ మెనూను తయారు చేసి విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో బడి విద్యార్థుల కోసం మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దసరా కానుకగా అక్టోబర్ 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10 తరగతుల విద్యార్థులకు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రారంభం చేయనున్నారు. ఈ మేరకు పొద్దున్నే పిల్లలకు వడ్డించే బ్రేక్ ఫాస్ట్ మెనూను తయారు చేసి విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల జడ్పీహెచ్ఎస్లో ఈ పథకాన్ని రేపు శుక్రవారం (అక్టోబరు 6) ఉదయం 8:45 గంటలకు ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,147 పాఠశాలల్లో 23 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. పాఠశాల ప్రారంభానికి 45 నిమిషాల ముందే అల్పాహారం అందివ్వనున్నారు. ఈ పథకం వల్ల పిల్లల్లో పోషకాహార లోపం నివారించడంతో పాటుగా హాజరు శాతం పెంచడం ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది.
బ్రేక్ ఫాస్ట్ మెనూ ఇదే
సోమవారం - ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
మంగళవారం - పూరి, ఆలు కుర్మ లేదా టమాటా బాత్ విత్ రవ్వ, చట్నీ
బుధవారం - ఉప్మా, సాంబార్ లేదా కిచిడి, చట్నీ
గురువారం - మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్, సాంబార్
శుక్రవారం - ఉగ్గాని/ పోహా/మిల్లెట్ ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ కిచిడీ, చట్నీ
శనివారం - పొంగల్/సాంబార్ లేదా వెజిటబుల్ పులావ్, రైతా/ఆలు కుర్మా