Ramzan: మార్చి 12 నుంచి రంజాన్ మాసం ప్రారంభం - వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
Telangana News: ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 12 నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో ముస్లిం ఉద్యోగులు గంట ముందే ఇంటికి వెళ్లేలా వెసులుబాటు కల్పించింది.
Telangana Government Good News To Muslim Employees: ఈ నెల 12 (మంగళవారం) నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం (Telangana Government) గుడ్ న్యూస్ చెప్పింది. అన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తోన్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధుల నుంచి గంట ముందే ఇంటికి వెళ్లేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే తమ విధులు ముగించుకుని ఇంటికి వెళ్లొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, నెలవంక దర్శనం మరుసటి రోజు నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇస్లాంలో రంజాన్ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దివ్య గ్రంథమైన పవిత్ర ఖురాన్ ఈ మాసంలోనే దివి నుంచి భువిపైకి అవతరించగా.. దీనికి ప్రతీకగానే ఈ మాసంలో ముస్లింలు కఠిన ఉపవాసాలు ఆచరిస్తారు. రంజాన్ మాసంలో సూర్యోదయానికి ముందు ముస్లింలు ఉపవాస దీక్షను ప్రారంభించి ప్రార్థనల్లో పాల్గొంటారు. సాయంత్రం సూర్యాస్తమయం అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు.