Telangana Elections 2023: కొత్త ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డులు, నెలాఖరు నుంచి పంపిణీ!
తెలంగాణలో ఎన్నికల షెడ్యూలు వెల్లడికావడంతో.. రాష్ట్రంలో కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న వారికి ఓటరు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియను ఎన్నికల సంఘం వేగవంతం చేసింది.
తెలంగాణలో ఎన్నికల షెడ్యూలు వెల్లడికావడంతో.. రాష్ట్రంలో కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న వారికి ఓటరు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియను ఎన్నికల సంఘం వేగవంతం చేసింది. ఓటర్లకు సంబంధించి కేవలం పది నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో సమారు 40 లక్షల కార్డులను ముద్రించడం విశేషం. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు 4 వరకు రెండు విడతలుగా ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సాధారణంగా ఏటా జనవరి 5న ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటిస్తూ ఉంటుంది. అయితే నవంబరు చివరిలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నందున ఏడాది వ్యవధిలోనే మరోసారి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను చేపట్టాల్సి వచ్చింది.
ఇప్పటిదాకా జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సి ఉండేది. తాజాగా ఏడాదిలో నాలుగు దఫాలు ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. దీంతో తొలిసారి ఓటర్లు 8.12 లక్షల మంది నమోదయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో మునుపెన్నడూ కొత్త ఓటర్లు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు.
దశల వారీగా ఓటరు కార్డుల పంపిణీ..
నూతన ఓటర్లకు ఈ నెలాఖరు నుంచి దశల వారీగా ఫొటో గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ చెప్పారు. బెంగళూరుకు చెందిన సంస్థ కార్డులను సిద్ధం చేస్తోంది. కార్డు వచ్చేలోగా ఆన్‌లైన్‌లో ఈ-ఎపిక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతోపాటు, కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లకు సంబంధించిన గుర్తింపు కార్డులను ఇకపై ప్రతివారం ముద్రణకు పంపేందుకు కసరత్తు చేస్తున్నారు.
18 లక్షల కార్డుల ముద్రణకు ఆమోదం..
జనవరిలో ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలోని నూతన ఓటర్లకు కార్డుల పంపిణీ ఇప్పటికే జరుగుతోంది. గడిచిన నెలలో ప్రకటించిన జాబితాలో నమోదైన సుమారు 18 లక్షల మందికి సంబంధించిన కార్డుల ముద్రణకు ఇటీవల ఆమోదం తెలిపారు. ఈ కార్డుల నకిలీలను సృష్టించేందుకు వీలు లేకుండా అత్యాధునిక ఫీచర్లను కార్డులో చేర్చారు. వాటిని ప్రత్యేక ముద్రణాలయాల్లోనే ముద్రించనున్నట్లు వికాస్‌రాజ్ వివరించారు. వచ్చే నెల మూడో వారం నాటికి నూతన ఓటర్లకు కార్డులు అందచేయాలన్న లక్ష్యంతో ఉన్నామని వికాస్‌రాజ్ వివరించారు.
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఇదే..
➥పోలింగ్ తేదీ- 30 నవంబర్ 2023
➥ కౌంటింగ్ తేదీ- 3 డిసెంబర్ 2023
➥ తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్: 3 నవంబర్ 2023
➥ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తేదీ- 3 నవంబర్ 2023
➥ ఎన్నికల నామినేషన్లకు తుది గడువు - 10 నవంబర్ 2023
➥ నామినేషన్ల స్క్రూట్నీ తేదీ- 13 నవంబర్ 2023
➥ నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ- 15 నవంబర్ 2023
రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 17 లక్షల 17 వేల 389 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో పురుష ఓటర్లు కోటి 58 లక్షల 71 వేల 493 మంది ఉన్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇక మహిళా ఓటర్లు కోటి 58 లక్షల 43 వేల 339 మంది ఉన్నట్లు ప్రకటించింది. ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 2,557 మంది ఉన్నట్లు ఈసీ స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఓటర్ల సంఖ్య 5.8 శాతం పెరిగినట్లు పేర్కొంది. కొత్త ఓటర్ల సంఖ్య 17.01 లక్షలుగా ఉండగా.. 6.10 లక్షల ఓట్లను తొలగించినట్లు ఈసీ స్పష్టం చేసింది.