KCR Good News: కార్మికులకు సీఎం కేసీఆర్ మే డే శుభవార్త, వేతనాల పెంపు - తక్షణమే అమల్లోకి అని ప్రకటన
Salary hike for Sanitation Workers: మే డే సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పారిశుధ్య కార్మికులకు శుభవార్త చెప్పారు. పెరిగిన వేతనాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
-Salary hike for Sanitation Workers: మే డే శుభవార్త.. పారిశుద్ధ్య కార్మికుల వేతనం పెంచిన కేసీఆర్
మే డే సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పారిశుధ్య కార్మికులకు శుభవార్త చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను రూ.1000 మేర పెంచుతూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తద్వారా 1 లక్షా 6 వేల 474 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. పెరిగిన వేతనాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. మే నెల నుంచి పెరిగిన వేతనాలను పారిశుధ్య కార్మికులు అందుకోనున్నారు. పనిలో పనిగా ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసి కార్మికుల వేతనాల పెంపునకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయంపై పారిశుధ్య కార్మికులు హర్షం చేస్తున్నారు.
జిహెచ్ఎంసి, మెట్రో వాటర్ వర్క్స్ తో పాటు, రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలల్లో పనిచేస్తూ ప్రస్తుతం జీతం అందుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ నెల నెలా పెరిగిన వేయి రూపాయల వేతనం అదనంగా జీతంతో పాటు కలిపి అందుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. పెరిగిన వేతనాలు తక్షణమే అమలులోకి వస్తాయని సీఎం తెలిపారు. ‘సఫాయన్న నీకు సలాం అన్న’ అనే నినాదంతో పారిశుద్ధ్య కార్మికుల కృషిని, త్యాగాలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి గుర్తిస్తూ వారి సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నదని సీఎం అన్నారు. రాష్ట్రంలో కష్టించి పనిచేసే ప్రతీ ఒక్క కార్మికుని సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
త్వరలోనే ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంపు..
త్వరలోనే రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికుల జీతాలు కూడా పెంచాలని నిర్ణయించామని, ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సీఎం తెలిపారు. తెలంగాణ పల్లెలు, పట్టణాలు గుణాత్మక అభివృద్ధిని సాధించడంలో పారిశుద్ధ్య కార్మికుల శ్రమ గొప్పదన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన పల్లెలు, పట్టణాలకు అవార్డులు రావడం వెనుక వీరి కృషి దాగి ఉన్నదని సీఎం తెలిపారు. పల్లెలు, పట్టణాల్లో నాటి, నేటి పరిస్థితులకు ఎంతో స్పష్టమైన తేడా ఉన్నదన్నారు. కార్మికుల కష్టసుఖాలను తెలుసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ వారి జీతాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వారికి అండగా నిలబడిందని అన్నారు. తద్వారా పారిశుద్ధ్య కార్మికులు కూడా అదే కృతజ్ఞత భావంతో మనస్ఫూర్తిగా పని చేస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడం పట్ల ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై కేసీఆర్ సమీక్ష
ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువుపై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువును తెలంగాణ ప్రభుత్వం మరో నెల రోజుల వరకు పొడిగించింది. ప్రభుత్వ స్థలాల్లో పేదలు కట్టుకున్న ఇండ్ల నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా, నిబంధనల మేరకు ఇండ్ల స్థలాలను క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. జీవో 58-59 ప్రకారం జంట నగరాల్లోని ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువును మరో నెల రోజులు గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ అంశంపై సీఎం కేసీఆర్ నూతన సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. నగర ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. నగరంలో తమ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలను కలిసి ప్రజలు తమకున్న నోటరీ తదితర ఇండ్ల స్థలాల రెగ్యులేషన్ సమస్యలను తెలపాలని సూచించారు. సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి వారికి హక్కుతో కూడిన పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.