Mahalaxmi Scheme: సబ్సిడీ గ్యాస్ లెక్కలు తేలాయ్ - గరిష్టంగా ఏడాదికి 8 సిలిండర్లు!
Subsidy Gas Cylinder: రాష్ట్రంలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి పౌర సరఫరాల శాఖ లెక్క తేల్చింది. మూడేళ్ల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని ఏటా ఇవ్వాల్సిన గరిష్ట సిలిండర్ల సంఖ్య 8గా పేర్కొంది.
![Mahalaxmi Scheme: సబ్సిడీ గ్యాస్ లెక్కలు తేలాయ్ - గరిష్టంగా ఏడాదికి 8 సిలిండర్లు! telangana civil supplies department decided 8 subsidy gas cylinders will distributing per year Mahalaxmi Scheme: సబ్సిడీ గ్యాస్ లెక్కలు తేలాయ్ - గరిష్టంగా ఏడాదికి 8 సిలిండర్లు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/29/8d6ff5fa5f7b5f8b37ef39f4fe3526541709184677979876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana Government Subsidy Gas Cylinder Scheme: రాష్ట్ర ప్రభుత్వం 'మహాలక్ష్మి' పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకానికి ఈ నెల 27న జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. సబ్సిడీ గ్యాస్ పథకానికి అర్హుల జాబితా రూపొందించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ.. ఏడాదికి ఎవరికి ఎన్ని సిలిండర్లు ఇవ్వాలన్న దానిపై లెక్కలు సిద్ధం చేసింది. రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులైన వారి మూడేళ్ల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఏటా ఇవ్వాల్సిన గరిష్ట సిలిండర్ల సంఖ్య ఎనిమిదిగా తేల్చింది. ఈ పథకానికి తొలుత 39.78 లక్షల మందిని అర్హులుగా తేల్చగా.. తర్వాత ఆ సంఖ్య 39.50 లక్షలకు తగ్గింది. ఇది మరింత తగ్గవచ్చని అధికార వర్గాల సమాచారం. అర్హులైన వారిలో దాదాపు 9.10 లక్షల మంది అత్యధికంగా ఏటా 8 గ్యాస్ సిలిండర్లు చొప్పున వినియోగిస్తారని అధికారులు లెక్కలు తేల్చారు. దీంతో ఈ పథకం కింద సబ్సిడీపై ఇవ్వబోయే సిలిండర్ల సంఖ్య ఏడాదికి ఎనిమిదిగా నిర్ధారించారు. మొత్తంగా ప్రభుత్వం భరించాల్సిన సబ్సిడీ నెలకు రూ.71.27 కోట్లు, ఏడాదికి రూ.855.2 కోట్లుగా తేలింది. ఇందులో ఉజ్వల కనెక్షన్ వినియోగదారులకు రూ.38.57 కోట్లు, సాధారణ గ్యాస్ కనెక్షన్ దారులకు రూ.816.65 కోట్లు అవుతుందని అంచనా వేశారు. రాష్ట్రంలో 11.58 లక్షల మంది ఉజ్వల గ్యాస్ కనెక్షన్ దారులు ఉన్నా.. సబ్సిడీ సిలిండర్ కోసం 5.89 లక్షల మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. అయితే, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ పై కేంద్రం ప్రతి సిలిండర్ కు రూ.340 సబ్సిడి ఇస్తుండడంతో వీటిపై రాష్ట్ర ప్రభుత్వం రూ.155 చొప్పున రాయితీ ఇస్తే సరిపోతుంది.
కాగా, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మూడేళ్ల గ్యాస్ వాడకం లెక్కలు తీయగా.. కొందరు అతి తక్కువ గ్యాస్ వినియోగిస్తుంటే మరికొందరు అసలు గ్యాస్ వాడడం లేదని తేలింది. గత మూడేళ్లలో సిలిండర్ ను ఒక్కసారి కూడా తీసుకోని వినియోగదారుల సంఖ్య 1,10,706గా ఉంది. వీరిలో సాధారణ కనెక్షన్ దారులు 92,633 మంది కాగా, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఉన్న వారు 18,073 మందిగా ఉన్నారు.
పథకం అమలు ఇలా
రాష్ట్ర ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో సాధారణ ప్రజలతో పాటు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారిని కూడా మహాలక్ష్మి పథకం కిందకు తీసుకువస్తున్నారు. అయితే, పథకం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాల్సిందేనని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఆ తర్వాత రూ.500 అదనంగా చెల్లించిన ధరను ప్రత్యక్ష నగదు బదిలీ (DBT - Direct Benefit Transfer) ద్వారా రీయింబర్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తోన్న రూ.40 రాయితీని కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో సిలిండర్ ధర రూ.955 ఉంటే.. వినియోగదారుడు చెల్లించాల్సిన రూ.500, కేంద్ర రాయితీ రూ.40 పోనూ మిగతా రూ.415ని రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుందని తెలుస్తోంది.
Also Read: Karimnagar News: శభాష్ పోలీస్ - రైతును 2 కి.మీ భుజాన మోసి కాపాడిన కానిస్టేబుల్, ఎక్కడంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)