Sit Notice To Tushar : ఫామ్‌హౌస్ కేసులో కీలక మలుపు - కేరళ మాస్టర్‌మైండ్‌కు సిట్ నోటీసులు ?
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న తుషార్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. 21న హాజరు కావాలని ఆదేశించింది.
Sit Notice To Tushar : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని నమోదైన కేసులో కేరళకు చెందిన తుషాక్‌కు తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన స్సెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నోటీసులు జారీ చేసింది. 21వ తేదీన హైదరాబాద్‌లో సిట్ టీమ్ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. తుషార్ కేరళకు చెందిన రాజకీయ నాయకుడు. బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని.. చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ మీద పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే బీజేపీలో అధికారికంగా సభ్యుడు కాదు. ఆయనకు ప్రత్యేకంగా ఓ హిందూ వేదిక ఉంది. తుషార్ ద్వారానే ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని సిట్ భావిస్తోంది.
రోహిత్ రెడ్డి, రామచంద్ర భారతితో మాట్లాడిన తుషార్
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు రామచంద్ర భారతిలతో తుషార్ ఫోన్‌లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. వారి ఫోన్ కాల్ జాబితాను విశ్లేషించినప్పుడు తుషార్ గురించి ఎక్కువ సమాచారం వెలుగు చూసింది. దీంతో ఆయన పాత్ర కీలకమని భావిస్తున్న సిట్ అధికారులు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో కూడా ఈ తుషార్ గురించి ఎక్కువ మాట్లాడారు. ఆయన అమిత్ షాతో సమావేశమైన ఫోటోలను కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో తుషార్‌కు నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే తనపై వచ్చిన ఆరోపణల్ని గతంలోనే మీడియా ద్వారా తుషార్ ఖండించారు. ఇప్పుడు విచారణకు హాజరవుతారా లేదా అన్నది తేలాల్సి ఉంది.
జగ్గు స్వామి అనే వ్యక్తి కోసం కేరళ పోలీసుల గాలింపు
మరో వైపు కేరళలో సిట్ బృందం విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. కొచ్చి, కొల్లాం వంటి ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. జగ్గు స్వామి అనే వ్యక్తిని పట్టుకోవడానికి సిట్ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. జగ్గు స్వామి కేరళలోని అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్నెస్స్‌లో పని చేస్తున్నారు. ఈ జగ్గు స్వామినే తుపాష్‌ను రామచంద్ర భారతికి పరిచయం చేసినట్లుగా సిట్‌కు ఆధారాలు లభించాయి. ఈ జగ్గు స్వామి దొరికితే చాలా వరకు కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ అధికారులు నమ్మకంతో ఉన్నారు. ఇటీవల ఓ డాక్టర్‌ను పట్టుకునే ప్రయత్నం కూడా విఫలం అయింది. ఇప్పటి వరకూ ఏడు రాష్ట్రాల్లో సిట్ బృందాలు సోదాలు చేశాయి కానీ.. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేకపోయారు. కీలక నింధితులు కేరళలో ఉన్నా.. అక్కడి ప్రభుత్వం సహకరిస్తున్నా.. నిందితుల్ని పట్టుకోలేకపోతున్నారు.
ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువగా సిట్ విచారణ
ఫామ్‌హౌస్ కేసులో సిట్ బృందం.. విచారణ ఎక్కువగా ఇతర రాష్ట్రాల్లోనే జరుగుతోంది. నిందితులు ఇతర రాష్ట్రాల వారు కావడమే దీనికి కారణం. మరో వైపు హైదరాబాద్‌కు చెందిన కీలక నిందితుడు నందకుమార్ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆయనపై ఉన్న పాత కేసుల్లోనూ కొత్తగా చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలను అతిక్రమించి నిర్మించిన ఆయన హోటళ్లలో నిర్మాణాలను కూలగొడుతున్నారు.