Rahul Gandhi: తెలంగాణ అస్తిత్వాన్ని మోదీ అవమానపర్చారు - రాహుల్ గాంధీ
తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోదీ మాట్లాడటం.. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే అని రాహుల్ గాంధీ అన్నారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా పాత పార్లమెంటు భవన చరిత్ర గురించి మాట్లాడుతూ ప్రధాని మోదీ తెలంగాణ విభజన గురించి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు రాహుల్ గాంధీ స్పందించారు. తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోదీ మాట్లాడటం.. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే అని అన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ తెలుగులో పోస్టు చేశారు.
ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఇవే
75 ఏళ్లుగా దేశానికి సేవలు అందిస్తున్న పార్లమెంట్ భవనం గురించి మాట్లాడిన సందర్భంగా ప్రధానమంత్రి మోదీ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విభజన నాటి పరిస్థితులు వివరించారు. అంతకుముందు అదే పార్లమెంటు భవనంలో చాలా రాష్ట్రాల విభజన జరిగిందని గుర్తు చేశారు. అలా జరిగిన సమయంలో రెండు రాష్ట్రాల్లోని ప్రజలంతా హ్యాపీగా సంబరాలు చేసుకున్నారని తెలిపారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన టైంలో మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించలేదని చెప్పుకొచ్చారు.
దేశంలో కొత్త రాష్ట్రం తెలంగాణ ఏర్పాటు సైతం ఇదే పార్లమెంట్ భవనంలో జరిగిందన్నారు. అయితే గతంలో వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఏర్పాటులా ఏపీ, తెలంగాణ విభజన జరగలేదని ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. వాజ్ పేయి హయాంలో ఆ మూడు రాష్ట్రాలను ఓ ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేయగా, ఆ రాష్ట్రాల్లోనూ ప్రజలు సంబరాలు చేసుకున్నారని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజన కాంగ్రెస్ హయాంలో జరిగిన ప్రక్రియ మాత్రం సరిగా జరగలేదన్నారు. ఈ విభజనతో ఏపీ, తెలంగాణగా తెలుగు రాష్ట్రాలు మారిపోయినా.. రెండు ప్రాంతాల్లోనూ సంబరాలు జరగలేదన్నారు. రెండు చోట్ల అసంతృప్తి మిగిలిందని, తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగిందంటూ మోదీ సంచనలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఎన్నో బలిదానాలు జరగడంతో పాటు రక్తపుటేర్లు పారాయని అన్నారు. అందువల్లే కొత్త రాష్ట్రం ఏర్పడినా తెలంగాణలో సంబరాలు చేసుకోలేకపోయారని మోదీ వ్యాఖ్యానించారు.
తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రసంగం ఎందరికో స్ఫూర్తినిస్తుందని అన్నారు. మాజీ ప్రధానుల సేవల్ని పేరుపేరునా కొనియాడారు. జీఎస్‌టీ, ఒకే దేశం - ఒకే పింఛను, జమ్మూకశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు లాంటి బిల్లుపై మోదీ మాట్లాడారు. ఎన్నో సేవలు అందించిన పార్లమెంట్ బిల్డింగ్ లో నేడు చివరిసారి సమావేశం అవుతున్నాం అని అన్నారు.