Kishan Reddy Oath As Union Minister: కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణం, మోదీ 3.0లో తెలంగాణకు కేబినెట్ బెర్త్
Kishan Reddy Oath Taking Ceremony: సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ముర్ము కిషన్ రెడ్డితో ప్రమాణం చేయించారు.
BJP MP Kishan Reddy Oath Taking Ceremony: కేంద్రంలో వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైంది. మొదట భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణం చేశారు. కేంద్ర మంత్రులుగా అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, తదితరులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు.
సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డికి మోదీ 3.0 కేబినెట్‌లో ఛాన్స్ దక్కింది. గతంలో ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సేవలు అందించడం తెలిసిందే. అనంతరం కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా సేవలు అందించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి బరిలోకి దిగిన కిషన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ పై విజయం సాధించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్‌సభ ఎన్నికల్లోనూ పార్టీని నడిపించారు కిషన్ రెడ్డి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు రాగా, ఉప ఎన్నికలలో మరో రెండు సీట్లు గెలుచుకుంది. 2023 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలం 8 ఎమ్మెల్యే సీట్లకు పెరిగింది. కిషన్ రెడ్డి నాయకత్వంలో మరింత బలం పుంజుకున్న బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది.