Nizamabad News: అవసరానికి ఆదుకోని సంఘాలు, పస్తులతో పడుకుంటున్న నేతన్నలు
నేతన్నకు సర్కారు ఆదుకునే దెన్నడు వారి కష్టాలు తీరెదెప్పుడు. రోజంతా కష్టపడితే రూ.130 కూలీ. భారంగా మారిన నేతన్న బతుకు బండి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 8 సంఘాలకు ప్రస్తుతం నడిచేది రెండే రెండు.
చేనేత బతుకులు నానాటికీ దిగజారిపోతున్నాయ్. సర్కార్ నుంచి సరైన సహకారం లేక జీవనోపాధి భారంగా మారింది. సరిపడా జీతాలు లేక మగ్గం నేసే వారి బతుకు భారంగా మారింది. నిజామాబాద్(Nizamabad) ఉమ్మడి జిల్లాలో మొత్తం 8 చేనేత సంఘాలున్నాయ్. ఇందులో ప్రస్తుతం రెండంటే రెండు మాత్రమే నడుస్తున్నాయ్. ఒకటి నిజామాబాద్ నగరంలో మరోకటి ఆర్మూర్ లో ఈ రెండు చోట్లే రాట్నం తిరుగుతోంది. జిల్లాలో పది వేలకుపైగా చేనేత కార్మికులుంటారు. ఉపాధి లేక నానా కష్టాలు పడుతున్నారు. నిజామాబాద్ నగరంలోని చేనేత సంఘంలో 866 మంది సభ్యులున్నారు. అయితే ఈ సంఘంలో కేవలం 22 మందికే ఉపాధి దొరుకుతోంది. ఈ సంఘంలో అంతా మహిళా కార్మికులే రాట్నం నడుపుతారు.
టెస్కో వద్ద పేరుకుపోయిన బకాయిలు
కరోనాతో గత రెండేళ్లు ఎంతో కష్టాలు పడిన చేనేత కార్మికులు మళ్లీ బిజీ అయ్యారు. అయితే వారి కష్టానికి సరిపడా ఫలితం మాత్రం రావటం లేదంటున్నారు. నిజామాబాద్ నగరంలోని చేనేత సంఘంలో 22 మంది మహిళలు పనిచేస్తున్నారు. ఈ సంఘం 2017 డిసెంబర్ 20న పున ప్రారంభించారు. చేనేత సంఘం మూతబడిన సమయంలో మహిళలు బీడీలు చుడుతూ ఉపాధి పొందేవారు. చేనేత సంఘం తిరిగి ప్రారంభం కావటంతో వారంతా చేనేత వైపు మొగ్గు చూపారు. వీరు రోజులో 8 గంటలు పనిచేస్తే వచ్చే జీతం కేవలం 130 రూపాయవలు మాత్రమే. మగ్గం నేసే వారికి చద్దరుకు 50 రూపాయలు ఇస్తారు. రోజులో 3 నుంచి నాలుగు చద్దరులు నేస్తే వారికి 150 నుంచి 200 మాత్రమే వస్తాయి. హైండ్లూమ్స్ తో చద్దర్లు, టవాళ్లు నేసి టెస్కోకు విక్రయిస్తారు. అయితే వీరి వద్ద నుంచి టెస్కో వారు నేసిన చద్దర్లు, టవాళ్లను తీసుకుంటున్నప్పటికి టెస్కో వారు డబ్బులు చెల్లించటం లేదని కార్మికులు వాపోతున్నారు. మూడేళ్గు దాదాపూ 2 లక్షల 50 వేల రూపాయలు టెస్కో వారు చెల్లించటం లేదని చెబుతున్నారు కార్మికులు.
ఎంతమంది వద్ద మొరపెట్టుకున్నా అంతే సంగతులు
టెస్కో వారు చెల్లించే డబ్బులతో కేంద్రం నుంచి ముడి సరుగు కొంటారు. టెస్కో వారు డబ్బులు చెల్లించకపోవటంతో ముడి సరుకు కొనడం భారంగా మారింది. అయితే నగరంలోని చేనేత సంఘానికి కమర్షియల్ కాంప్లెక్స్ ఉండటంతో దాంతో వచ్చే కిరాయి డబ్బులతో ముడి సరుకు కొంటున్నారు. పని నిలిపివేస్తే కార్మికులకు ఉపాధి కరవవుతుందన్న ఉద్దేశంతో సంఘం వారు వారి డబ్బులను ముడి సరుకుకు వాడుతున్నారు. టెస్కోపై ఆశలు పెట్టుకుంటే అంతే సంగతులు అంటున్నారు. కేంద్రం నుంచి కొన్న ముడి సరుకుపై 40 శాతం రాయితీ ఇస్తున్నారు ఆ డబ్బులు కార్మికులకు చెందుతుంది. టెస్కో నుంచి డబ్బులు ఇవ్వాలని ఇప్పటికే ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు కార్మికులు.
గిట్టుబాటు కాని కూలీ డబ్బులు
అయితే జిల్లాలో చేనేత పని చేసేందుకు కార్మికులు దాదాపు 10 వేల మంది ఉన్నారు. సర్కార్ నుంచి సరైన ప్రోత్సాహం లేక ఇప్పటికే 6 చేనేత సంఘాలు మూతపడ్డాయి. నడుస్తున్న రెండు సంఘాలకు టెస్కో నుంచి డబ్బులు రావటం లేదు. నిజామాబాద్ నగరంలోని చేనేత సంఘంలో 866 మంది సభ్యులకు కేవలం 22 మందికి మాత్రమే పని దొరుకుతోంది. వారికి కూడా సరిపడా కూలీ గిట్టు బాటు కావటం లేదు. చేనేత పనులు చేసేందుకు చాలా మంది ఉన్నా.. ఉపాధి కల్పించేందుకు సరిపడా షేడ్లు లేవు. ముడిసరుకు లేదు. సొసైటీలకు ఎలాంటి లాభం లేకుండా పోయింది. పర్చేజ్ చేస్తున్న నూలు మీద 40 శాతం కార్మికులకు యారం సబ్సిడీ మాత్రమే ఇస్తున్నారు. ప్రతీ సొసైటీకి ఆర్థిక సాయం, లేదంటే లోన్లు, వర్క్ షేడ్లను మంజూరు చేయాలని కోరుతున్నారు చేనేత కార్మికులు.
ప్రభుత్వాలు పట్టించుకుంటేనే బతుకు
కార్మికులకు సబ్సిడీ ద్వారా లోన్లు ఇస్తే సొంతంగా ఇంట్లోనే మగ్గాలు పెట్టుకుని జీవనోపాది పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నష్టాల్లో ఉన్నా కార్మికుల కోసం నడిపిస్తున్నామని చేనేత సంఘం సభ్యులు చెబుతున్నారు. రోజుకు 500 నుంచి 600 బెడ్ షీట్లు నేస్తున్నప్పటికీ టెస్కో నుంచి డబ్బులు రాక ముడి సరుకు కోనేందుకు భారంగా మారిందని చెబుతున్నారు. చేనేత నడవాలంటే ముడి సరుకుపైనే ఆధారం అని చెబుతున్నారు కార్మికులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా చేనేత కార్మికులను పట్టించుకుంటే తమ బతుకులు బాగు పడుతాయని కోరుతున్నారు.