Vivek Venkataswamy: చెన్నూర్ నియోజకవర్గానికి 4వ సారి దక్కిన మంత్రి పదవి, కాకా ఫ్యామిలీకి మూడు సార్లు దక్కిన కార్మిక శాఖ
Telangana Politics | ఉమ్మడి ఆదిలాబాద్ లోని చెన్నూర్ నియోజకవర్గానికి నాలుగోసారి మంత్రి పదవి దక్కింది. గడ్డం వెంకట్ స్వామి (కాకా) కుటుంబానికి కలిసొస్తున్న కార్మిక శాఖ. మూడోసారి మంత్రి పదవి వరించింది.

Telangana Cabinet Expansion | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గంకు 4సార్లు మంత్రిత్వ శాఖ దక్కడం చర్చనీయాంశంగా మారింది. అందులో మూడుసార్లు కార్మిక శాఖ చెన్నూర్ నియోజకవర్గానికే దక్కింది. 1962లో చెన్నూర్ ఎస్సీ నియోజకవర్గం ఏర్పడగా.. 1967-1972 వరకు కోదాటి రాజమల్లు ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఇందులో ముఖ్యంగా ఒకే శాఖను తండ్రి, ఇద్దరు కొడుకులు నిర్వహించడం ఒక రకంగా చరిత్రలో రికార్డే.. కాక వెంకటస్వామి కుటుంబ సభ్యులు ఈ రికార్డును సృష్టించారు. ఈ ముగ్గురు కూడా కార్మిక శాఖ మంత్రులుగా నియామకం కావడం రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది.
కాకా కుటుంబానికి కలిసొస్తున్న కార్మిక శాఖ
గడ్డం కుటుంబానికి కార్మిక శాఖ కలిసి వస్తోంది. అటు తండ్రి, ఇటు కుమారులు ఇద్దరూ ఆ శాఖ మంత్రులుగా పని చేయడం గమనార్హం. తండ్రి వెంకట స్వామి కేంద్ర, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా చేయగా.. కొడుకులు ఇద్దరూ రాష్ట్ర కార్మిక మంత్రులుగా నియామకం అయ్యారు. కార్మిక నేతగా ఎదిగిన వెంకటస్వామి ఒకసారి రాష్ట్ర, రెండు సార్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 101 కార్మిక సంఘాలకు అధ్యక్షునిగా కొనసాగిన ఏకైక నాయకుడు కాకా వెంకటస్వామి. 1973, 1995లలో కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేశారు. 1978లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక శాఖ బాధ్యతలు చేపట్టారు.
ఇక గడ్డం వెంకట స్వామి పెద్ద కుమారుడు గడ్డం వినోద్ రాష్ట్ర కార్మిక మంత్రిగా పనిచేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో వినోద్ 2004 నుండి 2009 వరకు కార్మిక శాఖ మంత్రిగా పనిచేసారు. ప్రస్తుతం 2025లో ఆయన తమ్ముడు గడ్డం వివేక్ సైతం కార్మిక శాఖ మంత్రిగా నియమితులు కావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలువురు సీనియర్ నేతలు ఆ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చెన్నూర్ నియోజకవర్గానికి మూడో సారి దక్కిన కార్మిక శాఖ మంత్రి పదవి
కార్మిక శాఖ మంత్రి పదవి చెన్నూర్ నియోజకవర్గానికి దక్కడం కూడా ఇది మూడో సారి కావడం గమనార్హం. చెన్నూర్ నియోజకవర్గంలో మొదటగా 1985 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోడ జనార్ధన్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోదాటి ప్రదీప్ పై గెలిచి.. నందమూరి తారక రామారావు మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక గడ్డం వినోద్ సైతం 2004లో చెన్నూర్ నుండే ఎమ్మెల్యేగా గెలుపొంది 2009 వరకు డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు.

ఇప్పుడు ఆయన తమ్ముడు గడ్డం వివేక్ సైతం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్ నుండి గెలుపొంది సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో 2025లో కార్మిక శాఖ మంత్రిగా నియమితులయ్యారు. మూడుసార్లు చెన్నూర్ నియోజకవర్గానికి కార్మిక శాఖ మంత్రి పదవి దక్కడంతో సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వివేక్ వెంకటస్వామి.. చెన్నూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి దశలో నడిపించే దిశగా, కార్మికుల సమస్యలను పరిష్కరించి, వెన్నుదన్నుగా నిలవాలని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.





















