Speaker Pocharam Srinivas: జన్మదిన వేడుకలు వద్దు- కన్నీళ్లు పెట్టుకున్న స్పీకర్ పోచారం
Speaker Pocharam Srinivas: అసెంబ్లీ ఆవరణలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. తన బాల్యమిత్రుడి మరణాన్ని తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు.
Speaker Pocharam Srinivas: అసెంబ్లీ ఆవరణలోని అమ్మవారి ఆలయంలో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. పూజాది కార్యక్రమాల అనంతరం అక్కడ మొక్కలు నాటారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అన్నిటి కంటే విలువైనది మానవ జన్మ అని తెలిపారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఆధారంగా చెప్పే ముఖ్యమైన సందేశం ఒక్కటేనని, మంచి పనులు చేస్తూ ఎవరి మనసు నొప్పించకుండా, మోసం చేయకుండా, సమాజం కోసం, ప్రజల కోసం జీవించాలని అన్ని మత గ్రంథాలు పేర్కొంటున్నట్లు వెల్లడించారు.
స్నేహితుల కోసం ఎవరైతే తపించి పని చేస్తారో.. కామం, క్రోధం, లోభం నుంచి ఎవరైతే దూరంగా ఉంటారో వారికి మరో జన్మ ఉండదని భగవద్గీత చెబుతోందని స్పీకర్ తెలిపారు. అన్ని మత గ్రంథాల సారం ఒకటేనని వాటిని ప్రతి ఒక్కరూ పాటించాలని కుల, మత భేదాలు లేకుండా జీవించాలని, మనిషిని మనిషిలా చూడాలని, మెలగాలని స్పీకర్ సూచించారు. మానవ జన్మ పూర్వ జన్మ సుకృతమని పోచారం అన్నారు.
ఆయన జన్మదిన వేడుకలను అసెంబ్లీ ఆవరణలో నిర్వహించడానికి అసలు కారణం పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శాసన సభాపతి కంటతడి పెట్టుకున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురైన స్పీకర్ నోటి వెంట మాటలు కూడా రాలేదు. జన్మదినం వేళ స్పీకర్ కంటతండి పెట్టుకోవడానికి కారణం ఆయన మిత్రుడి మరణం. అత్యంత సన్నిహితుడు, బాల్య మిత్రుడు అయిన సాలం బీన్ అలీఖాన్ తో స్నేహాన్ని పోచారం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. బాల్య మిత్రుడు సాలం బీన్ అలీఖాన్ మరణం తనను కలచి వేసిందని పోచారం తెలిపారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తన మిత్రుడి మరణం కారణంగానే తాను జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్టు తెలిపారు.
తన మిత్రుడి మరణం తాను తట్టుకోలేకపోతున్నానని స్పీకర్ తెలిపారు. అందుకే తన నియోజక వర్గంలో జన్మదిన వేడుకలు రద్దు చేశానని స్పష్టం చేశారు. తన మిత్రుడు మరణంతో పోచారం మీడియాతో మాట్లాడుతూనే కంట తడి పెట్టుకున్నారు. తన ప్రాణ మిత్రుడిని తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. సాలం బీన్ అలీఖాన్ మరణాన్ని తట్టుకోలేకపోయానంటూ కంటతడి పెట్టుకున్నారు. తన అంత్యక్రియలకు ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లానని పోచారం తెలిపారు.