Nizamabad: కుక్కల కోసం ఖర్చు చేశారా! కాజేశారా ? రూ.20 లక్షల ఖర్చుపై అనుమానాలు
నిజామాబాద్ నగరంలో కుక్కల బెడదను నియంత్రించేందుకు రూ. 20 లక్షల ఖర్చు చేసినట్లు చూపించడం గందరగోళానికి గురిచేస్తోంది.
Dogs Issue In Nizamabad Municipal Corporation
- అయినా నగర వాసులకు తప్పని కుక్కల బెడద
- ఒక్కో కుక్కకు రూ.1600 చొప్పున చెల్లింపులు
- నెల్లూరు నుంచి టీమ్ రాలేదు, కానీ లక్షల ఖర్చేలా !
నిజామాబాద్: నలుగురు నవ్విపోదురు గాక నాకేంటి అన్న చందంగా తయారైంది నగరపాలక సంస్థ పనితీరు. అభివృద్ధి, ప్రజల సమస్యల కోసం వెచ్చించాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. నగరంలో కుక్కల బెడదను నియంత్రించేందుకు రూ. 20 లక్షల ఖర్చు చేసినట్లు అధికారులు చూపించడం గందరగోళానికి గురిచేస్తోంది. వాస్తవంగా కుక్కల కోసం ఖర్చు చేశారా లేక కాజేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద మొత్తం డబ్బులను ఖర్చు చేసి మరి కుక్కలను ఎందుకు నియంత్రించలేకపోయారన్న ఆరోపణలు నగర పాలక సంస్థపై వస్తున్నాయి.
సర్వసభ్య సమావేశంలో లెక్కలు బయటకు !
నిజామాబాద్ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో ఈ లెక్కలు బయటకు రావడం అనుమానాలు రేకెత్తిస్తోంది. నిజామాబాద్ నగరంలో రోజురోజుకు గ్రామ సింహాల బెడద పెరిగిపోతొంది. నగరంలో ఎక్కడ చూసినా వీధి కుక్కలు విలాయ తాండవం చేస్తున్నాయి. ఇప్పటికే అనేకమంది నగర ప్రజలు ఈ కుక్కల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్నారు. గత రెండేళ్లుగా కుక్కలను నియంత్రించేందుకు నగరపాలక సంస్థ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై నగర వాసుల్లో నెలకొన్న అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోందిది.. వీధి కుక్కల బెడదను నియంత్రించాలని నగరపాలక సంస్థ అధికారులకు అనేక ఫిర్యాదులు అందిన స్పందించకపోవడం నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది.
నెల్లూరు నుంచి ప్రత్యేక బృందాలు
కుక్కల బెడదను తగ్గించేందుకు నెల్లూరు నుంచి ప్రత్యేక బృందాలు రావాల్సి ఉంటుంది. గతంలో వారిని ఇక్కడికి రప్పించి కుక్కలను పట్టుకోవడంతో అప్పట్లో కొంతవరకు వీటి బెడద తగ్గింది. ఆ తర్వాత ఏర్పడిన నగరపాలక సంస్థ పాలకులు దీనిపై దృష్టి సారించకపోవడంతో ప్రజలు కుక్క కాటుకు గురవుతున్నారు. కుక్కలను పట్టుకునేందుకు నెల్లూరుకు చెందిన ప్రత్యేక బృందాలు వస్తేనే వీటిని నియంత్రించే అవకాశం ఉంటుంది. కానీ గత రెండేళ్లుగా నగరపాలక సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అప్పట్లో నగరపాలక సంస్థ ఎంహెచ్ఓ గా పనిచేసిన సిరాజుద్దీన్ హయాంలో మాత్రమే కుక్కల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించారు. ఆ తర్వాత అలాంటి చర్యలు తీసుకోలేదు.
కుక్కలు పట్టకున్నా కాసులు పట్టేశారు !
ప్రత్యేక బృందాలకు ఒక్కొక్క కుక్కకు 1600 రూపాయలు చెల్లిస్తారు. కానీ చేయని ఖర్చుకు 20 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు చూపించడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్పొరేటర్లు నిలదీసినా ఏలాంటి సమాధానం చెప్పకుండా దాటవేశారు. దీంతో 20 లక్షల రూపాయలు దుర్వినియోగం జరిగినట్లు సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా పాలకులు, జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి సమగ్ర విచారణ జరపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వస్తావుగా కుక్కల కోసం 20 లక్షల రూపాయలు ఖర్చు చేశారా లేక కాజేశారా అనే దానిపై వెల్లువెత్తిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం అధికారులపై ఉందని నగర పాలక సంస్థ ప్రజలు అంటున్నారు.