Nizamabad News: మరోసారి లైమ్‌లైట్‌లోకి బాబ్లీ ప్రాజెక్టు- ఈసారి మాత్రం వేరేలా
తెరుచుకున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు. అందర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందం మేరకు ప్రాజెక్టు గేట్లను అధికారులు తెరిచారు. జూలై 1 నుంచి ఆక్టోబర్29 వరకు తెరిచి ఉండనున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తారు అధికారులు. అంతరాష్ట్ర నది జలాల ఒప్పందంలో భాగంగా మహారాష్ట్రలో ఉన్న బాబ్లి గేట్లను అధికారులు ఎత్తారు. గోదావరి నదిపై మహారాష్ట్రలో ఉన్న బాబ్లిగేట్లను ప్రతి ఏడాది జూలై 1న ఎత్తడం ఒప్పందంలో భాగం. అక్టోబర్ వరకు బాబ్లిగేట్లను ఎత్తి ఉంచుతారు. గోదావరి నదిపై నిర్మించిన బాబ్లి ప్రాజెక్టులో ప్రస్తుతం ఒక టీఎంసీ నీరు నిల్వ ఉంది. బాబ్లీ డ్యాం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కనాధ్ ఖేడుకర్, సీడబ్ల్యుసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు, చక్రపాణి, ఎస్సారెస్పీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రవి వంశీయులు గేట్లను ఎత్తి నీటిని దిగవకు వదిలారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 23.432 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శుక్రవారం ఉదయం 3,372 క్యూసెక్కుల ఇన్ ప్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోందని తెలిపారు అధికారులు.
బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు జరిగింది
బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏ మాత్రం పొసగలేదు. మహారాష్ట్ర భూభాగంలో ఆ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మించింది. ఆంధ్రప్రదేశ్ ఎంత వారించినా వినలేదు. చివరకి సుప్రీం కోర్టు బాబ్లీ ప్రాజెక్టు విషయంలో తీర్పును మహారాష్ట్రకు అనుకూలంగా ఇచ్చింది. దీంతో సీడబ్ల్యూసీ అనుమతులతో నాందేడ్ జిల్లాలో బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లతో 2004లో రూపు దిద్దుకుంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టును నిర్మించారు. ఎందుకంటే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ప్రధానంగా వరద వచ్చేది గోదావరి నది నుంచే... గోదావరి మహారాష్ట్ర నాసిక్ నుంచి మొదలై వరద శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకుంటుంది. అప్పటికే మహారాష్ట్ర గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన చిన్న మధ్యతరగతి 12 ప్రాజెక్టులకుపైగా నిర్మించింది. అయితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గిపోతుందన్న ఉద్దేశ్యంతో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయ్.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగున నుంచి 31 కిలో మీటర్ల దూరంలో బాబ్లీ ప్రాజెక్టు ఉంటుంది. 2.74 టీఎంసీల సామర్ధ్యంతో బాబ్లీ ప్రాజెక్టును నిర్మించారు. మొత్తం 14 గేట్లతో ఈ బ్యారేజీ నిర్మాణం జరిగింది. జూలై 1 నుంచి అక్టోబర్ 29 వరకు అంటే 120 రోజులపాటు వర్షాకాలం సీజన్‌లో బాబ్లీ గేట్లు తెరిగి ఉంటాయ్. ఈ మధ్య కాలంలో వచ్చిన వరదే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో స్టోరేజ్ అవుతాయ్. మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురిసి గోదావరి నది ప్రవహిస్తేనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు జలకళ వస్తుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 90 టీఎంసీలు. ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు కొనసాగుతున్నాయ్. ఈ గేట్ల మరమ్మతుల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 50 కోట్ల రూపాయలను మంంజూరు చేసింది.