National Herald Case: తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలకు ఈడీ నోటీసులు - ప్రచారంలో నిజమెంత !
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం 2005లోని సెక్షన్ 50 కింద కాంగ్రెస్ నేతలకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలకు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) నోటీసులు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం 2005లోని సెక్షన్ 50 కింద కాంగ్రెస్ నేతలకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారని కథనాలు వస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి సైతం ఈడీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇదే కేసులో ఇప్పటికే సోనీయా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సైతం ఈడీ నోటీసులు జారీ చేసిందని దుష్ప్రచారం జరిగింది. అయితే తనకు ఎలాంటి నోటీసులు రాలేదని, ఢిల్లీ నుంచి కొందరు తెలుగు మీడియాను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు కవిత తన ట్వీట్ లో పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎండీ అలీ షబ్బీర్, పి సుదర్శన్ రెడ్డిలతో పాటు రేణుకా చౌదరిని ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం 2005లోని సెక్షన్ 50 కింద కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేసింది ఈడీ. సుదర్శన్ ను అక్టోబర్ 10న విచారణకు హాజరు కావాలని ఈడీ తమ నోటీసులలో పేర్కొంది. కాగా, ఆ మరుసటి రోజు షబ్బీర్ అలీ ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంటుంది. నేషనల్ హెరాల్డ్ విచారణలో పాల్గొన్న కంపెనీల ఖాతాలకు కాంగ్రెస్ నేతలు పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేసినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. గతంలో వివిధ కాంగ్రెస్ ప్రభుత్వాల్లో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన నగరానికి చెందిన మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత రేణుకా చౌదరికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఏ నోటీసులు అందలేదన్న కాంగ్రెస్ నేతలు..
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ కీలక నేతలు రేణుకా చౌదరి, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసిందన్న ప్రచారంపై నేతలు స్పందించారు. తమకు ఇప్పటివరకూ ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని వారు స్పష్టం చేశారు. నోటీసులు వస్తే విచారణకు హాజరవుతానని షబ్బీర్ అలీ అన్నారు.