Gun Misfire: పోలీస్ స్టేషన్లో గన్ మిస్ ఫైర్, తీవ్ర గాయాలతో కానిస్టేబుల్ మృతి
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్లో గన్ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఆయన చనిపోయారు.
Komaram Bheem Asifabad: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలిస్ స్టేషన్ లో గన్ మిస్ ఫైర్ కావడంతో విషాదం చోటుచేసుకుంది. నేటి ఉదయం వేకువజామున 4:30 గంటల సమయంలో గన్ మిస్ ఫైర్ అయి రజనీ కుమార్ అనే కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానిక పోలీసులు హుటాహుటిన అతన్ని కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అధిక రక్తస్రావం కావడంతో కానిస్టేబుల్ మృతి చెందినట్లు సమాచారం.
పోలీస్ స్టేషన్లో గన్ మిస్ ఫైర్
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్లో గన్ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో బుల్లెట్ తాకి, ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. కౌటాల పోలీస్ స్టేషన్లో 2020 బ్యాచ్ గుడిపేట బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ సూర రజనీకుమార్ (29) విధులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో గన్ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమయ్యింది. బులెట్ తల భాగం నుండి దూసుకుపోయింది.
రజినీకుమార్ స్వగ్రామం బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి.. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. గన్ మిస్ ఫైర్ అయిందా.. లేక రజినీకుమార్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారా అనే కోణంలో సైతం విచారిస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అతన్ని కాగజ్‌నగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కానిస్టేబుల్ పరిస్థితి విషమిస్తుండటంతో హైదరాబాద్ కు తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో కానిస్టేబుల్ రజనీ కుమార్ చనిపోయారు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పి కే సురేష్ కుమార్, కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్, కౌటాల సీఐ బుద్దే స్వామి, ఆసుపత్రికి చేరుకుని డాక్టర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.