Kamareddy: కామారెడ్డిలో తుపాకీ హల్‌చల్! బార్‌లో బీభత్సం చేసిన యువకుడు
రఫీక్ అనే వ్యక్తి బార్ లోకి చొరబడి గన్ తో హల్చల్ చేశాడు. దీంతో అక్కడ మద్యం సేవిస్తున్న మందుబాబులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై పారి పోయారు.
ఓ వ్యక్తి గన్ తో హల్చల్ చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏ - వన్ బార్ లో చోటుచేసుకుంది. గత కొన్ని నెలల క్రితం ఓ ముగ్గురు వ్యక్తులు కామారెడ్డి శివారు లో జరిగిన ఘటన మరవక ముందే తాజా ఘటన జరిగింది. నెల క్రితం ఓ దాబా వద్ద భోజనం చేయడానికి వెళుతున్న నలుగురు యువకులను బెదిరించిన సంఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. తాజాగా నిన్న రాత్రి ఓ వ్యక్తి తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం నిన్న రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో అజంపూర్ కాలనీకి చెందిన వ్యక్తి రఫీక్ కామారెడ్డి లోని కొత్త బస్టాండ్ ఎదురుగా గల ఏ - వన్ బార్ లోకి చొరబడి గన్ తో హల్చల్ చేశాడు. దీంతో అక్కడ మద్యం సేవిస్తున్న మందుబాబులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై పారి పోయారు. అనంతరం స్థానికులు కామారెడ్డి పట్టణ పోలీసులకు సమాచారం చేరవేయడంతో సంఘటన స్థలానికి చేరుకొని గన్ కలిగి ఉన్న రఫీక్ ను అదుపులోకి తీసుకొన్నారు. అతణ్ని అక్కడి నుంచి కామారెడ్డి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అక్కడ ఒక్కసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గన్ కల్చర్ కామారెడ్డిలో జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. యువకుడు ఉపయోగించిన గన్, ఎయిర్ గన్గా పోలీసులు గుర్తించారు.
మహిళ ఆత్మహత్య
పెళ్లయి ఐదేళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదని మనస్తాపం చెంది ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకున్నది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట పట్టణంలోని భారత్‌నగర్‌కు చెందిన కామాటి శివాణి అలియాస్ శ్రీవాణి అనే 23 ఏళ్ల యువతికి ఐదేళ్ల క్రితం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం తుక్కాపూర్ గ్రామానికి చెందిన మల్లేశంను ప్రేమ వివాహం చేసుకుంది. వారిద్దరూ సిద్దిపేటలోనే నివాసం ఉంటున్నారు. అయితే పెళ్లయి ఐదేళ్లు గడుస్తున్నా ఇంకా పిల్లలు పుట్టడం లేదని శివాణి తీవ్ర మనస్తాపం చెంది మంగళవారం రాత్రి సిద్దిపేట పట్టణ శివారులోని ఇమాంబాద్ వద్ద గల రంగనాయకసాగర్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అక్కడున్న వారు వెంటనే పోలీసులకు తెలపడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.