Nizamabad News: నిజామాబాద్ టీఆర్‌ఎస్‌లో ప్రెస్‌మీట్ పంచాయితీ, మళ్లీ అలిగి వెళ్లిపోయిన జడ్పీ ఛైర్మన్
మళ్లీ అలిగిన నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు. ప్రెస్ మీట్ తాను రాకముందే మొదలెట్టారని అలక. ప్రెస్ మీట్ జరుగుతుండగా వచ్చి జీవన్ రెడ్డి పిలుస్తున్న కారెక్కి వెళ్లిపోయిన జడ్పీ ఛైర్మన్.
పీయూసీ ఛైర్మన్, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్ మధ్య విభేదాలు మళ్లీ మొదటికొచ్చాయ్. మరోసారి ఆసహనం వ్యక్తం చేశారు జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు.
ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా నిజామాబాద్ లోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ ఆపీస్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్ 4 గంటలకు మొదలైంది. జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా ఇద్దరు హాజరయ్యారు. జీవన్ రెడ్డి మాట్లాడుతుండగా క్యాంపు కార్యాలయానికి జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు వచ్చారు. తాను వచ్చే సరికే ప్రెస్ మీట్ ప్రారంభం కావటంతో ఒక్కసారిగా ఆగ్రహంతో వెనుదిరిగి వెళ్లిపోయారు విఠల్ రావు. జీవన్ రెడ్డి పిలుస్తున్నా వినిపించుకోకుండా క్యాంపు కార్యాలయం నుంచి కారులో వెళ్లిపోయారు.
మొదట్నుంచి జీవన్ రెడ్డికి విఠల్ రావు మధ్య వార్ నడుస్తూనే ఉంది. జీవన్ రెడ్డి నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం నుంచి విఠల్ రావు జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విఠల్ రావు సీనియర్ నాయకుడు కావటంతో ఆయన్ను పార్టీ అధిష్ఠానం జడ్పీ ఛైర్మన్ గా ఎన్నుకుంది. అయితే అప్పటి నుంచి వీరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.
ఆర్మూర్ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా ... జీవన్ రెడ్డి జడ్పీ ఛైర్మన్ ను పిలిచేవారు కాదు. కనీసం ప్లెక్సీల్లో జడ్పీ ఛైర్మన్ ఫొటో కూడా ఉండేది కాదు. జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు మాక్లూర్ మండలంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే వారు. అది ఎమ్మెల్యేకు నచ్చదనేది జడ్పీ ఛైర్మన్ వర్గీయులు చెప్పుకుంటారు. ఓసారి నందిపేట్ మండలంలోని లక్కంపల్లి సెజ్ లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జడ్పీ ఛైర్మన్ కు ఆహ్వానం ఇవ్వలేదు. ఆ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు. జడ్పీ ఛైర్మన్ కు ఆహ్వానం అందకున్న అక్కడి వెళ్లారు అయితే పోలీసులు జడ్పీ ఛైర్మన్ విఠల్ రావును అడ్డుకోవటంతో అక్కడే మంత్రి వేముల, ఎమ్మెల్సీ కవిత ముందు ఆసహనం వ్యక్తం చేశారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ జడ్పీ ఛైర్మన్ వర్గం, జీవన్ రెడ్డి వర్గంగా చీలిపోయింది. అయితే జీవన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత ఆర్మూర్ లో తీసిన ర్యాలీలో జీవన్ రెడ్డి నడిపిన బుల్లేెట్ పై జడ్పీ ఛైర్మన్ ఎక్కారు. దీంతో వీరి మధ్య విభేదాలు సమసిపోయాయనుకున్నారంత. అయితే తాజాగా ప్రెస్ మీట్ జడ్పీ ఛైర్మన్ రాకముందే మొదలెట్టడంతో కథ మళ్లీ మొదటికొచ్చినట్లైంది.
జడ్పీ చైర్మన్ విఠల్ రావు అందరిముందే అలిగి వెళ్లి పోయారు. అయితే ప్రెస్ మీట్ తర్వాత ఎమ్మెల్యే జీవిన్ రెడ్డి జడ్పీ కార్యాలయానికి వెళ్లి జడ్పీ ఛైర్మన్ ను బుజ్జగించినట్లు తెలుస్తోంది.