Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
Road Accident: ఆదిలాబాద్ జిల్లా జాతీయ రహదారి మరోసారి రక్తంతో తడిసింది. అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
Telangana Road Accident: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని మేకలగండి కార్నర్ సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను కారు ఢీకొట్టి కొద్దిదూరం వెళ్లి బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదురుగు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.
నిర్మల్ జిల్లా భైంసా నుంచి ఎనిమిది మందితో ఆదిలాబాద్ వస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న వారిలో మొయిజ్ (60), అలీ(8), ఖాజా మొయినుద్దీన్ (40), మహమ్మద్ ఉస్మానుద్దీన్ (11) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడ్డ ఫరీద్ (12) రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ మిగతా వారినీ 108 అంబులెన్స్‌లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
మృతులు, క్షతగాత్రులంతా ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలానీ వాసులు. వీళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన రక్త సంబందికులు. గాయపడ్డ వారికి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోలీసులు కేసు నమోదు చేసుకొని పంచనామా నిర్వహించి మార్చురీకి తరలించారు.
ఈ మేకలగండి కార్నర్ సమీపంలో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గతేడాది సైతం ఓ కుటుంబం ఇలాగే ప్రమాదంలో చనిపోయారు. ఏడాదిపాటున ఇక్కడ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ అనేక మంది మృత్యువాత పడుతున్నారు. గుడిహత్నూర్ నుంచి సీతాగొంది వరకు గుట్ట ప్రాంతం డౌన్ లెవెల్‌లో ఉండడం వల్ల ఎక్కువగా చాలామంది న్యూట్రల్ లో వెళుతూ ఉంటారు. భారీ వాహనాలు అయితే న్యూట్రల్లో వెళుతూ కంట్రోల్ లేకుండా ఒక్కోసారి ఎదురుగా వచ్చిన వారిని ఢీకొంటూ వెళ్ళిపోతుంటాయి. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి.
మేకలగండి కార్నర్‌లో జరిగే ప్రమాదాల్లో జాతీయ రహదారి అధికారుల భద్రత వైఫల్యం.. రవాణా శాఖ అధికారుల లోపం కూడా ఉన్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. వీరిపై చర్య తీసుకునేలా రోడ్డు ప్రమాదాలు జరగకుండా చోరవ తీసుకోవాలని కోరుతున్నారు.