1980లో ఇందిరా గాంధీకి సంపూర్ణ మెజారిటీ- ప్రధాని మోదీ, షా గుర్తుంచుకోండి!: భట్టి విక్రమార్క
రాహుల్ గాంధీపై తప్పుడు కేసులు పెట్టి, గుజరాత్ సూరత్ కోర్టులో 2 ఏళ్ల జైలుశిక్ష పడేలా చేసి, కోర్టు ఇచ్చిన తీర్పులోనే హైకోర్టుకు వెళ్లడానికి నెల రోజులు సమయం ఇచ్చిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.
పార్లమెంటు నుంచి రాహుల్ గాంధీ బహిష్కరణ రాజ్యాంగ స్ఫూర్తితో తీసుకున్న నిర్ణయముగా కనిపిస్తలేదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. లోక్ సభ స్పీకర్ ఆ నెల రోజులు ఆగకుండా రాజ్యాంగ స్ఫూర్తిని మొత్తంగా పరిగణలోకి తీసుకోకుండా పార్లమెంటు నుంచి బహిష్కరణ చేయడం భారత రాజ్యాంగానికి విరుద్ధం అన్నారు. బీజేపీ, కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తప్పుడు కేసులు పెట్టి, గుజరాత్, సూరత్ కోర్టులో రెండు సంవత్సరాల జైలు శిక్ష పడేలా చేసి, ఆ జైలు శిక్ష కూడా కోర్టు ఇచ్చిన తీర్పులోనే హైకోర్టుకు వెళ్లడానికి నెల రోజులు సమయం ఇచ్చిందని గుర్తు చేశారు.
లోక్ సభ స్పీకర్ కు ఒక సభ్యుడిని చట్టసభల నుంచి బహిష్కరించడం, సస్పెండ్ చేయడం విచక్షణ అధికారమైనప్పటికీ, ఆ విచక్షణ అధికారం భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలి. ఇది కేవలం కక్ష సాధింపు చర్యగా ఉందన్నారు. పార్లమెంట్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు చాలా తెలివైనవారు. దేశం కోసం ప్రజల కోసం మాట్లాడే వారిని గుండెల్లో పెట్టుకొని చూస్తారు. గతంలో స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీని 1975 సంవత్సరంలో అలహాబాద్ కోర్టు ఆరేళ్లు బహిష్కరిస్తే తన పదవికి రాజీనామా చేసి, తిరిగి పోటీ చేసిన ఆమెని
బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రజలు గెలిపించారని గుర్తుచేశారు. అప్పటి ప్రభుత్వం ఇందిరాపై వేధింపులకు పాల్పడడాన్ని సహించలేని ప్రజలు 1980 లో సంపూర్ణ మెజార్టీతో గెలిపించి అధికారం ఇచ్చారన్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.
ప్రజాస్వామిక వాదులను అణగదొక్కడం కోసం నియంతృత్వ పోకడలు అవలంభించే ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పిన చరిత్ర ఈ దేశానికి ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి ఈ దేశ ప్రజలందరూ ఉన్నంటే ఉన్నారు. దేశాన్ని సామాజికంగా, ఆర్థికంగా విభజించి విచ్ఛిన్నం చేయాలని చూస్తుంటే ప్రజల సంపద ప్రజలకే చెందాలని అదాని లాంటి బహుళ జాతి సంస్థలకు కాదని గొంతేత్తి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ తమకంటే పెద్ద నాయకుడు అవుతుండన్న భయంతో నరేంద్ర మోదీ, అమిత్ షా నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం కుట్రతో సూరత్ లో తప్పుడు కేసులు పెట్టిందని భట్టి విక్రమార్క ఆరోపించారు.
దేశ సంపద దోచుకున్న ఆర్థిక నేరస్తులైన నీరవ్ మోదీ, లలిత మోదీలను దేశం దాటించి బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తోందని, మన సంపదను ప్రజలకే చెందాలన్నందుకు రాహుల్ ను అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాట్లాడటం రాహుల్ గాంధీ చేసిన తప్పా?. దేశంలో భావ స్వేచ్ఛను చంపేస్తున్నారని, మాట్లాడే వారిని మాట్లాడనివ్వడం లేదని చెప్పడంలో తప్పు ఏముందన్నారు. దేశంలో ఉన్న ఎయిర్ పోర్టులు, సీ పోర్టులు, బొగ్గు గనులు, పవర్ సెక్టార్, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా ప్రజలకే చెందాలని క్రోని క్యాపిటలిస్టులైన ఆదానీకి దోచిపెట్టడం సరికాదన్నందుకే రాహుల్ పై మోదీ కక్షగట్టారంటూ మండిపడ్డారు.
బీజేపీ ఆకృత్యాలను ఖండించాలి..
బీజేపీ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేస్తున్న ఆకృత్యాలను ముక్తకంఠంతో అందరూ ఖండించాలని భట్టి విక్రమార్క కోరారు. నిజమైన ప్రజాస్వామ్యవాది, లౌకికవాది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం, ప్రగతిశీల సామ్యవాదాన్ని ముందుకు తీసుకెళ్తున్న రాహుల్ గాంధీకి భయపడి నరేంద్ర మోదీ, అమిత్ షా, బీజేపీ ప్రభుత్వం పన్నిన కుట్రయే ఈ బహిష్కరణ వేటు అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని కాపాడుకోవడమే ఈ దేశ ప్రజాస్వామ్యం, సంపద, వనరులు, రాజ్యాంగాన్ని కాపాడుకోవటం. రాహుల్ గాంధీ బహిష్కరణ వేటుకు వ్యతిరేకంగా ఎఐసిసి ప్రత్యేక ఉద్యమ కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. తెలంగాణలో కూడా ఉద్యమాలు ఉంటాయని అందులో తాను పాల్గొంటానని స్పష్టం చేశారు. బిజెపికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీకి మద్దతుగా ఆసిఫాబాద్ లో సాయంత్రం 2000 మందితో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ కాగడాల ప్రదర్శన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది.