TSPSC: టీఎస్పీఎస్సీ ఉద్యోగ పరీక్షలు, జనరల్ ర్యాంకుల జాబితా రూపకల్పనలో మార్పులు
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నిర్వహించిన రాతపరీక్షల ఆధారంగా జనరల్ ర్యాంకుల జాబితాల రూపకల్పనలో కమిషన్ మార్పులు చేసింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ అధికారిక ప్రకటన విడుదలచేశారు.
TSPSC General Ranking List: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నిర్వహించిన రాతపరీక్షల ఆధారంగా జనరల్ ర్యాంకుల జాబితాల (GRL) రూపకల్పనలో కమిషన్ మార్పులు చేసింది. 2023 సెప్టెంబరు 20 జారీచేసిన మార్గదర్శకాలకు సవరణలు చేసింది. అభ్యర్థులు రాత పరీక్షలో సమాన మార్కులు సాధించినపుడు ర్యాంకుల ఖరారులో అవలంబించాల్సిన విధానంపై స్పష్టత ఇచ్చింది. 2022 ఏప్రిల్ నుంచి టీఎస్పీఎస్సీ వెలువరించిన అన్ని నోటిఫికేషన్లకు ఈ విధానం వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ అధికారిక ప్రకటన విడుదలచేశారు.
మార్గదర్శకాలు ఇలా..
➥ టీఎస్పీఎస్సీ నిర్వహించే ఏదైనా పరీక్షలో ఇద్దరి కంటే ఎక్కువ మందికి సమాన మార్కులొస్తే.. అభ్యర్థి స్థానికత ఆధారంగా ర్యాంకు నిర్ణయిస్తారు. స్థానికత కలిగిన వారికి ఉన్నత ర్యాంకు, తెలంగాణేతరులకు ఆ తరువాత వచ్చే ర్యాంకు కేటాయిస్తారు.
➥ మార్కులు, స్థానికత సమానంగా ఉన్నప్పుడు అభ్యర్థి పుట్టినతేదీని పరిగణనలోకి తీసుకుంటారు. ఎక్కువ వయసు కలిగిని అభ్యర్థికి తొలి ర్యాంకు కేటాయిస్తారు. మార్కులు, స్థానికత, పుట్టినతేదీ సమానంగా ఉన్న పక్షంలో జనరల్ స్టడీస్ మినహా సబ్జెక్టుల పేపర్లలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకు నిర్ణయిస్తారు.
➥ అన్ని కేటగిరీల్లోనూ సమానంగా ఉంటే... ఆ పోస్టుకు కావాల్సిన విద్యార్హత(డిగ్రీ, డిప్లొమా, పీజీ ఇలా..) పరీక్ష ఉత్తీర్ణత సాధించిన తేదీని ప్రామాణికంగా తీసుకుని ర్యాంకు ఇస్తారు. (గతంలో పాసైన తేదీ కాకుండా పాసైన సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోవాలన్న నిబంధన ఉండేది)
➥ అప్పటికీ అన్ని రంగాల్లో సమానంగా ఉంటే.. ఆ అర్హత పరీక్షలో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఎక్కువ పర్సంటైల్‌ సాధించిన వారికి ఉన్నత ర్యాంకు కేటాయిస్తారు.
➥ అక్కడా ఇద్దరికన్నా ఎక్కువమందికి సమానంగా ఉంటే ఉన్నత విద్యార్హతను పరిగణనలోకి తీసుకుంటారు.
➥ అప్పటికీ ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మందికి సమానంగా ఉంటే ఆ ఉన్నత విద్యార్హతలో ఉత్తీర్ణత సాధించిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు.
➥ అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నా ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమందికి సమాన మార్కులు వస్తే.. టీఎస్‌పీఎస్సీ నిర్ణయమే అంతిమంగా ఉంటుంది.
ALSO READ:
ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యక్ష నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ను మార్కు చేయకుండా ఓపెన్, రిజర్వుడు కేటగిరీల్లో 33 1/3శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని ఆదేశించింది. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజేష్ కుమార్ దరియా కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక ప్రక్రియలో ఈ మేరకు అమలుచేయాలని స్పష్టం చేస్తూ సీఎస్ శాంతికుమారి ఫిబ్రవరి 1న మెమో జారీ చేశారు. దీంతో సమాంతర రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ సహా వివిధ నియామక బోర్డులు ఫలితాల వెల్లడికి కసరత్తు మొదలు పెట్టాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..