Bodhan Conflict: బోధన్‌లో ఉద్రిక్తతలో 147 మంది అదుపులోకి, 400 మందితో బోధన్‌లో భద్రత - ప్రస్తుత పరిస్థితి ఇదీ
Nizamabad CP: బోధన్‌లో అంతా ప్రశాంతంగా ఉందని నిజామాబాద్ సీపీ తెలిపారు. నగరంలో 144 సెక్షన్ అమలులో ఉందని ఎవరూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Bodhan Communal Fight: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై నిజామాబాద్ సీపీ నాగరాజు స్పందించారు. నిన్న (మార్చి 20) జరిగిన ఘటనలో 147 మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా సీపీ తెలిపారు. వీరిలో రెండు గ్రూపులకు చెందిన వారు ఉన్నారని వెల్లడించారు. మొత్తం 10 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లుగా వివరించారు. ప్రస్తుతానికి బోధన్‌లో అంతా ప్రశాంతంగా ఉందని తెలిపారు. నగరంలో 144 సెక్షన్ అమలులో ఉందని ఎవరూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా సరే స్వచ్ఛందంగా బంద్ పాటించవచ్చని అన్నారు. కానీ, వారిని దైర్జన్యంగా బంద్ చేయంచకూడదని తెలిపారు. ఇతర ప్రాంత నాయకులు బోధన్‌లోకి రావటానికి వీలులేదని సీపీ నాగరాజు తేల్చి చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని వెల్లడించారు.
ఇతర జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు సహా మొత్తం 400 భద్రతా సిబ్బందితో బోధన్‌లో మోహరించినట్లుగా నిజామాబాద్ సీపీ వెల్లడించారు. ప్రస్తుతానికి పట్టణంలో అంతా ప్రశాంతంగా ఉందని వివరించారు. సోమవారం ఉదయం బోధన్‌లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు పర్యటించారు. ‘‘శివాజీ విగ్రహం ఏర్పాటు ఆందోళనకు కారణమైన 10 మందిపై నాన్ బెయిల్ కేసులు నమోదు చేశాం. బోధన్ లో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. విగ్రహం ఏర్పాటుకు మున్సిపల్ అనుమతి ఉన్నా కలెక్టర్ అనుమతి ఇంకా రాలేదు. ఈ గొడవలకు కారణమైన వారిని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆందోళన కారులను గుర్తించాం. బోధన్ బంద్‌కు అనుమతి లేదు. 140 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నాం. ఇతర ప్రాంతాల నాయకులు బోధన్ కు రావద్దు.’’ అని వివరించారు.
విగ్రహమే వివాదానికి మూలం
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం ఈ ఉద్రిక్తతలకు దారి తీసింది. అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం స్థానిక బీజేపీ, శివసేన కార్యకర్తలు శివాజీ విగ్రహ ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేకుండా విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని ఎంఐఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విగ్రహం తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆందోళన కారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. అయినా అదుపు కాకపోవడంతో పోలీసులు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించాల్సి వచ్చింది. ప్రధాన కూడళ్ల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశారు. రెండు వర్గాలనుంచి 10 మంది చొప్పున ప్రతినిధుల బృందాన్ని పోలీసులు చర్చలకు ఆహ్వానించారు. పోలీసుల ఆహ్వానంపై ఇరు వర్గాలు స్పందించాల్సి ఉంది.
ఈ రెండు వర్గాలు ఆందోళనకు దిగడం, ర్యాలీలకు సిద్ధం కావడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. బారీకేడ్లను ఏర్పాటు చేశారు. కామారెడ్డి, నిర్మల్ జిల్లాల నుండి అదనపు పోలీసు బృందాలను రప్పించారు. ఏకంగా 400 మందితో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు.