Jainoor Tribal Woman: జైనూర్ ఆదివాసి మహిళ గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్- చీర, నగదు ఇచ్చిన మంత్రి సీతక్క
Asifabad News | కొన్ని రోజుల కిందట వేధింపులకు గురైన జైనూరు ఆదివాసీ మహిళ చికిత్స అనంతరం గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. మంత్రి సీతక్క బాధితురాలికి కొత్త చీర, నగదు ఇచ్చారు.
Jainoor Tribal woman discharged from Gandhi Hospital | హైదరాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడి, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళకు చికిత్స పూర్తి కావడంతో ఆదివారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. ఈ మేరకు మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణక్క, డిసిసి అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.
నగదు, చీరును అందించి వాహనంలో ఆమెను స్వగ్రామానికి పంపించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... బాధితురాలి ఆరోగ్యం కుదుటపడడంతో అన్ని విధాలుగా వైద్య పరీక్షలు చేసిన వైద్యులు డిశ్చార్జ్ చేయటం జరిగిందని తెలిపారు. ఆదివాసి ఆడబిడ్డపై దాడి జరిగిందని తెలియగానే ప్రభుత్వం వెంటనే స్పందించిందని గుర్తు చేశారు. బాధితురాలికి అండగా నిల్చామని, ఆమెను అన్ని విధాలుగా ఆదుకుంటామని వివరించారు.
అసలేం జరిగిందంటే..
ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరులో షేక్ మగ్దూం అనే ఓ ఆటోడ్రైవర్ కొన్ని రోజుల కిందట ఓ ఆదివాసీ మహిళపై లైంగిక దాడికి యత్నించి, ఆమెను తీవ్రంగా గాయపర్చినట్లు ఆరోపణలున్నాయి. జైనూరు ఘటన అనంతరం జరిగిన పరిణామాలపై ఆదివాసీ ప్రతినిధులతో సమావేశం నివేదికను మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మబొజ్జు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ఏం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ఫోకస్ చేసిందని చెప్పారు.
కొన్ని రోజులపాటు జైనూరులో 144 సెక్షన్
ఈ ఘటన అనంతరం బాధితురాలికి న్యాయం చేయాలని ఆదివాసీలు పోరాటానికి దిగారు. పోలీసులు తమకు న్యాయం చేయడం లేదంటూ పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడంతో పోలీసు శాఖ, ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ సమయంలో కొన్ని రోజులపాటు శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా జైనూరులో 144 సెక్షన్ చేశారు. దాంతో ఇతర ప్రాంతాలవారు జైనూరు వెళ్లడానికి అనుమతి లేదని అప్పటి ఎస్పీ తేల్చి చెప్పారు. జైనూరు టౌన్ చుట్టూ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని, అయితే ఎలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని ఆదివాసీ సంఘాలను, బాధిత మహిళ కుటుంబాలకు పోలీసులు సూచించారు.