Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో కుంగిన బ్రిడ్జి, పక్కకు ఒరిగిపోయిన పిల్లర్ - ఏ క్షణమైనా కూలే ఛాన్స్!
బ్రిడ్జిపై భాగం సైతం బీటలు వారింది. వంతెన పిల్లర్లలో ఒకటి పక్కకు ఒరిగింది. దీంతో కాగజ్‌నగర్, దహేగామ్ మద్య రాకపోకలు నిలిపివేశారు
Asifabad News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు బ్రిడ్జీలే బీటలు వారుతున్నాయి. కాగజ్‌నగర్ మండలంలోని అందవెల్లిలో పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జి ప్రస్తుతం డెంజర్ జోన్ లో ఉంది. భారీ వరదలకు పెద్దవాగుపై బ్రిడ్జి కుంగింది. బ్రిడ్జి పై భాగం సైతం బీటలు వారింది. వంతెన పిల్లర్లలో ఒకటి పక్కకు ఒరిగింది. దీంతో కాగజ్‌నగర్, దహేగామ్ మద్య రాకపోకలు నిలిపివేశారు అధికారులు. బ్రిడ్జి కుంగిపోవడంతో ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉందని ప్రజలు భయపడుతున్నారు.
ఇటీవల కుండపోతగా కురిసిన వర్షాలతో బ్రిడ్జి దెబ్బ తిన్నదని అధికారులు చెబుతున్నారు. రాకపోకలు లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జికి పగుళ్లు రావడంతో ఎక్కడి వారిని అక్కడే నిలిపేసి తిరిగి పంపిస్తున్నారు అధికారులు. వంతెనకు రెండు వైపులా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలు సైతం బ్రిడ్జి కూలిపోతుందని భయాందోళనకు గురై అటు వైపుగా వెళ్ళడం లేదు. ప్రస్తుతం బ్రిడ్జి వద్ద అధికారులు అప్రమత్తమై రాకపోకలను నిలిపివేశారు. కుంగిన బ్రిడ్జికి మరమ్మత్తులు చేసి త్వరలో ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
ఓ రైతు గల్లంతు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం పాపన్నపేట గ్రామానికి చెందిన మడే భగవాన్ (45) అనే రైతు వాగులో గల్లంతు అయ్యాడు. పాపన్నపేట సమీపంలోని వాగు దాటే క్రమంలో గల్లంతు అయినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రాణహిత నది ఉప్పొంగుతుండడంతో పాపన్నపేట సమీపంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. మడే భగవాన్ అనే వ్యక్తి వ్యవసాయ పనుల కోసం ఒర్రె దాటే క్రమంలో గల్లంతు అయ్యాడు. అతడి ఆచూకీ కోసం నాటు పడవలు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
నాలుగు రోజుల కిందట పొలం పనులకు వెళ్లిన సమయంలో ప్రాణహిత వరద ప్రవాహానికి గల్లంతు అయ్యాడు. వరద ప్రవాహం భారీగా ఉండడంతో అతని ఆచూకీ నేటి వరకు దొరకలేదు. పోలిస్ సిబ్బంది, గజ ఈత గాల్ల సాయంతో నాటు పడవలో కలిసి వరద ప్రవాహంలో ఇప్పటికీ గాలిస్తున్నారు. ప్రాణహిత నది భారీగా ఉప్పొంగి ఉండడంతో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో పంట పొలాలకు, వేరే గ్రామాలకు, చేపలు పట్టేందుకు ప్రజలు ఏట్టి పరిస్థితుల్లో సాహసం చేయకూడదని అధికారులు సూచిస్తున్నారు.
ఉప్పొంగి ప్రవహిస్తున్న ప్రాణహిత నది
తెలంగాణ సరిహద్దులో ఉన్న ప్రవహిస్తున్న ప్రాణహిత నదికి నీటి ప్రవాహం పెరుగుతోంది. నీటి మట్టం అంతకంతకూ పెరుగుతుండగా తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గూడెం వంతెనను తాకుతూ నది ప్రవహిస్తోంది. నదీ తీర ప్రాంతంలో ఉన్న పంటలన్నీ వరద నీటి కారణంగా ముంపునకు గురయ్యాయి. గత పదేళ్లలో ఇంత వరద ఎప్పుడూ రాలేదని స్థానికులు పేర్కొంటున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానెపల్లి మండలంలోని దిందా, గూడెం, కోయపెల్లి, చిత్తం, బూరుగూడ గ్రామాల పరిధిలో వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది.
మహారాష్ట్రలోని గోసికుర్ద్ డ్యాం గేట్లు ఎత్తివేయడంతోనే నదిలో నీటిమట్టం పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది వరదతో పుష్కర ఘాట్లు నీట మునిగాయి. ఒడ్డున గల శ్రీకార్తీక్ మహరాజ్ ఆలయం చుట్టూ వరద చేరింది. తాటపల్లి, గుండాయిపేట, వీర్ధండి సమీపంలోని పెన్ గంగా నిండు కుండలా ప్రవహిస్తోంది.