Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లాలో త్వరలో ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభం; కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ
Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లాలో కొత్త ఎయిర్‌పోర్ట్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. జిల్లా అభివృద్దికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.

Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, పెండింగ్‌లో ఉన్న ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులను త్వరలోనే పట్టాలెక్కిస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎయిర్‌పోర్ట్ మైదానాన్ని సందర్శించి, విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోపాటు ఆదిలాబాద్ ఎంపీ జి. నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ, నిర్మాణ స్థలం యొక్క మ్యాపింగ్, ఇతర సాంకేతిక అంశాలను వారు ఈ సందర్భంగా అధికారులను కిషన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు సంబంధించిన భూమి సరిహద్దులు, అందుబాటులో ఉన్న విస్తీర్ణంపై అధికారులు మ్యాపింగ్‌ను మంత్రికి చూపించి, వివరాలను నివేదించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.., ఈ విమానాశ్రయం నిర్మాణం ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం. ఈ ప్రాజెక్టు పూర్తి కోసం కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది' అని తెలిపారు. తెలంగాణలోని మారుమూల ప్రాంతాలన్నింటినీ దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానించాలనే ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు. నిర్మాణ పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభమయ్యేందుకు ఉన్న అడ్డంకులను వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ ప్రాజెక్టుకు పూర్తి సహకారం ఉంటుందని ఆశిస్తున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే, ఈ ప్రాంత ప్రజల రవాణా, వ్యాపార అవసరాలు తీరుతాయన్నారు కిషన్ రెడ్డి. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ ప్రక్రియలో మరింత వేగం పుంజుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ విమానాశ్రయం భవిష్యత్తులో ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి, పర్యాటక రంగానికి ఊతమిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ పరిశీలనలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఎస్పీ అఖిల్ మహాజన్, విమానాశ్రయాల అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి చెందిన ఇంజినీర్లు, ఆర్డీఓ స్రవంతి, మున్సిపల్ కమిషనర్ రాజు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.





















