Cow Killing Case: ఆవు దూడను చంపిన కేసులో నిందితుడు అరెస్ట్ - ఆదిలాబాద్ డిఎస్పీ జీవన్ రెడ్డి
ఆవు దూడను చంపిన కేసులో నిందితుడు అరెస్ట్ అయ్యాడని ఆదిలాబాద్ డిఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు.

ఆవు దూడను చంపిన కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేశామని ఆదిలాబాద్ డిఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. కత్తితో ఆవు దూడను చంపి, అటవీ జంతువుల మాంసంగా అమ్మే ప్రయత్నం చేశాడు నిందితుడు. ఇదివరకే దొంగతనం కేసులు, ఫారెస్ట్ కేసులు, సస్పెక్ట్ షీట్ నమోదు అయింది. గోవద నిషేధం, ఆవులను చంపినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం రౌడీ షీట్ ఓపెన్ అయినట్లు డీఎస్పీ తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని గిమ్మ గ్రామ శివారు ప్రాంతంలో ఆవు దూడను కత్తితో పొడిచి ప్రాణాపాయ స్థితిలో ఉన్నదని సమాచారం తెలిసిన వెంటనే జైనథ్ సిఐ డి.సాయినాథ్, ఎస్సై లు వెటర్నరీ డాక్టర్ తో కలిసి సంఘటన స్థలానికి వెళ్లగా, అక్కడ కొన ఊపిరితో ఉన్న దూడను బ్రతికించే ప్రయత్నం చేసినారు. కత్తితో ఆవు దూడను పొడిచిన కారణంగా కొద్దిసేపటికి ఆవు దూడ ప్రాణాలను విడిచింది. ఈ సంఘటనలో జైనథ్ సీఐ మరియు ఎస్ఐ గౌతమ్ లు విచారణ చేపట్టగా.. ఆవు దూడ సిర్సన్న గ్రామానికి చెందిన సాయికుమార్ ది అని తేలినది, బాధితుడు ఆవు దూడను పరిశీలించి తనదే అని ధ్రువీకరించారు.
ఆవు ను చంపడానికి ఉపయోగించిన ఆయుధం వేటకు ఉపయోగించే బల్లెం లా ఉందని దాని అధారంగా విచారణ ప్రారంభించిన జైనథ్ సిఐ, గిమ్మ గ్రామం కి చెందిన వ్యక్తి రాథోడ్ సంజయ్ మీద అనుమానంతో అతనిని శనివారం అదుపులోకి విచారణ చేయగా.. అతను నేరాన్ని ఒప్పుకోవడం జరిగిందని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. నిందితుడు గిమ్మ గ్రామానికి చెందిన వ్యక్తి... ఇతనిపై ఇదివరకే మేకలు దొంగతనం చేసిన కేసు, గుడిలో దొంగతనం చేసిన కేసు, ఫారెస్ట్ కేసులు నమోదు అయి ఉన్న విషయాన్ని తెలిపారు. ఇతను ఇలా చంపిన ఆవు దూడను అటవీ జంతువుల మాంసంగా విక్రయించే ప్రయత్నం చేస్తాడని విచారణలో తేలింది అని తెలిపారు.
ఇతనిపై జైనథ్ పోలీస్ స్టేషన్ నందు 135 క్రైమ్ నెంబర్ తో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఇట్టి కేసు నందు నేరస్తుని పట్టుకోవడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జైనథ్ సిఐ మరియు ఎస్ఐలను జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ అభినందించారు. ఆవులను చంపిన, అక్రమంగా రవాణా చేసిన, అక్రమంగా అమ్మిన చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుందని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఉల్లంఘించిన వారిపై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయబడతాయని హెచ్చరించారు.





















