Nirmal District News: నిర్మల్ జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి- మహారాష్ట్ర దాటిందనుకుంటే కుంటాలలో ప్రత్యక్షం
Telangana: పక్కరాష్ట్రాలకు వెళ్లిపోయిందనుకున్న పులి మళ్లీ తిరుగొచ్చి టెన్షన్ పెడుతోంది. నిర్మల్ జిల్లా ప్రజలను, అధికారులను పరుగులు పెట్టిస్తోంది.
Nirmal News: నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని సమీప అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం వారం రోజులుగా కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. మహారాష్ట్ర సరిహద్దుకు వంద మీటర్ల దూరంలోని అప్పారావుపేట్ బీట్ పరిధి వైపు గురువారం ఆనవాళ్లు కనిపించాయి. ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో వెతుకులాట ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు దాటే వీలుందని ఇక్కడి అధికారులు మహారాష్ట్ర ఎఫ్ఆర్ఓ, అధికారులకు పులి సంరక్షణ బాధ్యతలను అప్పగించేందుకు నివేదికలు రూపొందించారు. పులి ఇక మహారాష్ట్ర సరిహద్దు దాటిందనుకున్నారు. హమ్మయ్య పులి వెళ్లిందని ఊపిరిపీల్చుకున్న ఆనందం కాసేపు కూడా నిలవలేదు. శుక్రవారం మళ్లీ కుంటాల, హనుమాన్ నగర్ తండా ప్రాంతాల్లో ప్రత్యక్షమైంది.
పులి సంచారాన్ని పలువురు రైతులు ప్రత్యక్షంగా చూశారు. కుంటాలలో ఉదయపు నడకకు తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో వెళ్లిన విజయ్ అనే వ్యక్తికి పులి తారసపడింది. గ్రామానికి కూతవేటు దూరంలోనే ఉండటంతో హుటాహుటీన పరుగెత్తి గ్రామస్థులకు విషయాన్ని తెలిపారు. సమీపంలోనే జక్కుల సతీష్ అనే రైతు చేనులో మొక్కజొన్న విత్తనం వేసి నీటితడులిచ్చారు. ఆ చిత్తడిలో పక్కనే వరి పొలంలో పులి పాదముద్రలు స్పష్టంగా కనిపించాయి.
అదే మార్గంలో హనుమాన్ తండా మీదుగా ఉదయం 8 గంటల సమయంలో వెళుతున్న పెద్దపులిని పంట పొలంలో, పత్తిని ట్రాక్టర్‌లో నింపుతున్న రైతులు చూశారు. పులిని గమనించి కేకలు వేస్తూ చెట్టెక్కి కూర్చున్నారు. కొందరు తండాకు చేరుకుని ప్రజలను అప్రమత్తం చేశారు. పులి తండాలోకి రాకుండా అందరూ కలిసికట్టుగా కేకలు వేస్తూ, డబ్బాలతో చప్పుడు చేయడంతో ప్రాథమిక పాఠశాల వెనక వైపు నుంచి అడవిలోకి వెళ్లిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
విషయం తెలుసుకున్న అటవీ అధికారులు అక్కడికి చేరుకొని అధికారులు సైతం పులి పాదముద్రలను సేకరించి నిర్ధారించారు. అయితే సమీపంలోనే అంబుగాం పరిసరాల్లోని మహారాష్ట్ర సరిహద్దులో సంచరించిన పులి అక్కడ ఇతర పులుల సంచారం ఉన్నట్లు పసిగట్టి దిశ మార్చు కుందేమోనని భావిస్తున్నారు. ఒక రాత్రిలోనే సుమారుగా 15 నుంచి 20 కిలోమీటర్ల మేర నడక కొనసాగించింది. అక్కడి కాళేశ్వర్ ప్రధాన కాల్వ వెంట జంతువును వేటాడుతూ.. ఇటు వైపు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
పులి తోడు కోసం ఇలా దిశ మార్చుకుంటూ తిరుగుతుందని అధికారులు చెబుతున్నారు. పులి సంచారంతో పంటలను నష్టపరిచే అడవి పందులు, మనుబోతులు, ఇతర జంతువులు దరిదాపుల్లోకి కూడా రావని బైంసా FRO వేణుగోపాల్ వివరించారు. పులి వచ్చిందని ఎవరు భయాందోళన చెందవద్దన్నారు. ఎవరైనా పులికి హాని కలిగించే చర్యలు చేపడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పులి సంచరించే ప్రాంతాల్లో విద్యుత్తు కంచెలు, ఉచ్చులు, ఇతరత్రా హానికర పరికరాలు ఉంటే తొలగించాలన్నారు అధికారులు. అటవీ శాఖ సిబ్బంది డీప్యూటి.ఆర్.ఓ. రేష్మా, టాస్క్ ఫోర్స్ డీఆర్ఓ రాజశేఖర్, ఎఫ్ఎస్ఓలు కీర్తిరెడ్డి, పూర్ణిమ, ఎఫ్.బి.ఓ లు.. టైగర్ మానిటరింగ్ మల్లేష్, అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. గ్రామస్తులు బయందోళనలకు గురి కావద్దని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటలలోపు పనులు ముగించి ఇంటికి చేరుకోవాలన్నారు. పులి సంచరించే ప్రాంతంలోకి పశువులు మేపటానికి తీసుకువెళ్లద్దని సూచించారు.