Yadadri Road Accident: హైదరాబాద్ హైవేపై విషాదం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు DSPలు మృతి, విషాదంలో కుటుంబాలు
Yadadri Road Accident: యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి.

Yadadri Road Accident:విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ప్రమాదానికి గురైన స్కార్పియో కారు నడి రోడ్డుపై సినిమాల్లో చూపించినట్టు బొంగరంలా గిర్రున తిరిగింది. ఈ దెబ్బకు అందులో ప్రయాణం చేస్తున్న ఇద్దరు డీఎస్పీలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.
ఓ కేసు విచారణ కోసం ఏపీకి చెందిిన ఇద్దరు డీఎస్పీలు, ఒక ఏస్పీ హైదరాబాద్ బయల్దేరారు. విజయవాడ నుంచి వస్తున్న వారు ప్రయాణించే స్కార్పియో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ వద్ద ప్రమాదానికి గురైంది. వేగంగా ట్రావెల్ చేస్తున్న స్కార్పియో వాహనం ఎదురుగా ఉన్న లారీని ఓవర్ టేక్ చేయబోయింది. ఈ క్రమంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
డివైడర్‌ను ఢీ కొట్టిన వాహనం పల్టీలు కొడుతూ బొంగరంలా గిర్రున తిరిగింది. అలా గిర్రున తిరుగుతూ ఆగింది. ఈ ప్రమాద సమయంలో అందులో ప్రయాణిస్తున్న వారంతా ఇర్కుక్కుపోయారు. చుట్టుపక్కల వారు వచ్చి తీసే వరకు బయటకు రాలేకపోయాడు. స్థానికులు స్పందించి వారిని తీసేసరికి ఇద్దరు డీఎస్పీలు చనిపోయి ఉన్నారు. మిగతా ఇద్దరు తీవ్రగాయాలతో పడి ఉన్నారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒక ఏఎస్పీ పరిస్థితి విషమంగా ఉన్నట్టుచెబుతున్నారు.
Continuous rains being reported in Hyderabad - people need to be alert . Two DSPs died in an accident while coming to Hyderabad - CCTV footage - my deepest condolences @APPOLICE100 pic.twitter.com/4wCRWzVhF2
— Dr Srinubabu Gedela (@DrSrinubabu) July 26, 2025
చనిపోయిన డీఎస్పీలు చక్రధర్‌రావు, శాంతారావుగా గుర్తించారు. గాయపడిన ఏఎస్పీ ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉంది. బండి నడిపిన నర్సింగరావుకి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం ఆ నాలుగు కుటుంబాల్లో పెను విషాదం నింపింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ ఆసుపత్రికి పరుగులు తీశారు.
ప్రమాదంలో ఇంటెలిజెన్స్ వింగ్ డిఎస్పీల మృతి కలచి వేసిందన్నారు సీఎం చంద్రబాబు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చక్రధరరావు, శాంతారావు ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థించారు
మంత్రి నారా లోకేష్ కూడా ప్రమాదంపై దీగ్భ్రాంతి వ్యక్తం చేశారు."తెలంగాణలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఇంటిలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీలు చక్రధర్ రావు, శాంతారావులు మృతిచెందడం దిగ్భ్రాంతికి గురిచేసింది. విధుల్లో భాగంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను." అని ట్వీట్ చేశారు.
దుర్ఘటన బాధాకరమని అన్న హోంమంత్రి అనిత క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. "ప్రమాదంలో గాయపడిన అడిషనల్ ఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నర్సింగరావుని ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటాం. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటాం." అని ట్వీట్ చేశారు.





















