కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారా? మళ్లీ కాంగ్రెస్‌లో చేరతారా?
కర్ణాటక ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ తెలంగాణ రాజకీయాలపై పడినట్టు కనిపిస్తోంది. బీజేపీ పుంజుకుంటుందని హస్తానికి హ్యాండిచ్చిన నేతలు యూటర్న్ తీసుకోవాలని ఆలోచనలో పడ్డారట.

కర్ణాటక ఎన్నికల రిజల్ట్స్ ముందుగా తెలంగాణ రాజకీయాలపై పడుతున్నట్టు కనిపిస్తోంది. మొన్నటికి మొన్న హస్తానికి హ్యాండిచ్చి కమలం గూటికి చేరిన నేతలంతా పునరాలోచనలో పడుతున్నారని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇన్నాళ్లు మోదీ గ్రాఫ్ పెరుగుతుందని బీజేపీ వైపు చూసిన వాళ్లంతా ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ వైపు యూటర్న్ తీసుకోవాలనే ఆలోచనలో పడ్డారట. ఇందులో ముందు వరుసలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. బైఎలక్షన్‌లో ఓడిపోయారు. కర్ణాటకలో కాంగ్రెస్ బంపర్ మెజార్టీతో గెలుపొందడంతో ఆయన మనసు మార్చుకోబోతున్నారట. మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఎలా ఉంటుందనే దానిపైనా తన అనచరులతో చర్చిస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్‌లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ చర్చల్లో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారని అయితే టీపీసీసీ చీఫ్ తనకు క్షమాపణలు చెప్పాలని కోరుకుంటుంటున్నట్టు టాక్.
కర్ణాటకలో కాంగ్రెస్ జయకేతనం తర్వాత బీజేపీ మరింత బలహీనంగా మారిందని, తెలంగాణలో ఆ పార్టీ పుంజుకునే ప్రసక్తి లేదని రాజగోపాల్ తన అనుయాయులతో అన్నారట. ఈటల రాజేందర్ కు రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగించినా ఆరు నెలల్లోనే ఎన్నికలున్న నేపథ్యంలో గెలుపు సాధ్యం కాదనే అభిప్రాయంలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారట. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ గ్రాఫ్ కూడా పడిపోతుందని చెప్పుకొచ్చారనే వార్త తెగ వైరల్ అవుతుంది.
రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా నిన్న నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ను వీడిన వాళ్లంతా మళ్లీ వస్తారని కామెంట్ చేశారు. అప్పటి నుంచి మీడియాలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి వెళ్తున్నారని పుంకాను పుంకాలుగా వార్తలు వస్తున్నాయ్.
ఇదిలా ఉంటే ఇదంతా ఉత్తదేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొట్టిపారేస్తున్నారు. పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. పార్టీ మార్పుపై ఎవరో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కర్నాటక ఫలితాల తర్వాత కొంతమంది కాంగ్రెస్ మిత్రులు తనను ఆహ్వానించింది నిజమేనని కానీ తాను బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్ ను ఓడించాలంటే బలమైన శక్తి కావాలన్నారు.
My political opponents are spreading rumours of me changing party. It's a lie. I'm staying with BJP and contesting from Munugode. They aim to confuse my supporters.
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) May 17, 2023





















