SLBC Tunnel పనుల్లో కీలక పరిణామం.. ప్రమాదకరమైన షియర్‌జోన్ దాటుకుని తవ్వకాలు: మంత్రి ఉత్తమ్
SLBC Tunnel Project Work | శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ పనుల్లో కీలక ముందడుగు పడిందని, షియర్‌జోన్‌ను విజయవంతంగా దాటుకుని తవ్వకాలు చేపట్టినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.

SLBC Tunnel Project | శ్రీశైలం: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ తవ్వకం పనుల్లో కీలక ముందడుగు పడిందని ప్రభుత్వం తెలిపింది. ఎడమ గట్టు కాలువ సొరంగం పనుల్లో అత్యంత ప్రమాదకరమైన షియర్‌జోన్‌ను విజయవంతంగా దాటుకుని తవ్వకాలు ముందుకు సాగుతున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. టన్నెల్ పనులపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన మంత్రి ఉత్తమ్.. గత ఆరు నెలల కాలంలోనే సుమారు 700 మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తయ్యాయని తెలిపారు.
ఎస్‌ఎల్‌బీసీలో మొత్తం 43.968 కిలోమీటర్ల పొడవైన ప్రధాన టన్నెల్‌లో ఇప్పటివరకు 79 శాతం మేర పనులు పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఎస్ఎల్‌బీసీలో ఇంకా 9.1 కిలోమీటర్ల మేర తవ్వకాలు పూర్తికావాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 7 నుంచి 7.5 మీటర్ల మేర తవ్వకం పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. పనులను మరింత వేగవంతం చేసేందుకు అదనపు డ్రిల్లింగ్ బూమర్, ఎలక్ట్రిక్ లోడర్లు, ఆధునిక ఎక్స్‌కవేటర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.
జర్మనీ నుంచి అక్టోబర్ చివరినాటికి ప్రత్యేక లోకోమోటివ్ రానుందని, ఇది అందుబాటులోకి వస్తే టన్నెల్‌లో తవ్విన మట్టిని అత్యంత వేగంగా బయటకు తరలించే వీలుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గతంలో ఒక నిర్మాణ సైకిల్ పూర్తవడానికి 48 గంటల సమయం పట్టేదని, ప్రస్తుతం ఆ సమయాన్ని 20– 24 గంటల మేర తగ్గించామని పేర్కొన్నారు. త్వరలోనే ఈ సమయాన్ని 10 గంటలకు మేరకు కుదించేలా పనుల వేగాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా పెట్టుకుని తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ తవ్వకాలను కొనసాగించాలని అధికారులను సూచించినట్లు తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు






















