Malla Reddy Time Travel: మల్లారెడ్డి మామూలోడు కాదు.. మహాత్మాగాంధీని.. మథర్ థెరిస్సాని కలిసొచ్చాడు…
Mallareddy Trending Video: చామకూర మల్లారెడ్డి అంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలీనోళ్లు లేరు. తన స్టైల్ మాటలు, చేతలతో ఎప్పుడూ ఎదో ఒక సన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. ఈ సారి అంతకు మించి చేశారు.

Mallareddy Trending Video: పాలమ్మిన.. పూలమ్మిన.. కాలేజీలు పెట్టిన.. కష్టపడిన… ఈ డైలాగ్‌తో ఓ రేంజ్ లో ఫేమస్ అయిపోయారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఒకప్పుడు మల్లారెడ్డి విద్యా సంస్థలు జనాలకు బాగా తెలుసు. ఆయనెవరో అంతగా తెలీలేదు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మల్లారెడ్డి ట్రెండ్ సెట్ చేశారు. తన అద్బుతమైన టైమింగ్, డైలాగ్ డెలివరీ, పంచ్‌లతో ట్రెండింగ్ స్టార్ అయిపోయారు. పార్టీ పండగైనా.. ప్రభుత్వ కార్యక్రమమైనా.. చివరకు సినిమా ఫంక్షన్ అయినా సరే మల్లారెడ్డి మైక్ అందుకుంటే దబిడి దిబిడే.. ఆ రేంజ్‌లో ఆయన యూత్‌లో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇదంతా తెలిసిందే కానీ.. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు మాట్లాడుకోవడం అంటే.. మల్లారెడ్డి మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చారు.
టైమ్ మెషిన్‌లోకి వెళ్లిన మల్లారెడ్డి
తన మాటలతో హడావిడి చేసే మల్లారెడ్డి… ఈసారి టైమ్ మిషన్‌లోకి వెళ్లారు. కాలంలో వెనక్కు ప్రయాణించి.. పలువురు ప్రముఖులను, గురువులను కలిశారు. అక్కడ గొప్పవారి నుంచి ఉపదేశం పొంది విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. ఇదంతా వినడానికి విచిత్రంగా ఉంది కానీ.. మల్లారెడ్డి కొత్త వీడియోలో ఇదంతా ఉంది. టైమ్ మిషన్ లో వెనక్కు వెళ్లిన మల్లారెడ్డి గొప్ప గొప్ప వారందరితో కలిశారు. వారితో మాట్లాడారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
తన మాటలతో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న మల్లారెడ్డి.. ఇప్పుడు తన విద్యా సంస్థలకు బ్రాండ్ క్రియేట్ చేసేందుకు క్రియేటివ్‌గా ఆలోచించారు. AI సాయంతో టైమ్ ట్రావెల్ ఎపిసోడ్ షూట్ చేశారు. చాలా విద్యా సంస్థలు పెద్ద పెద్ద సెలబ్రిటీలను తమ బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుంటుంటే.. తన కంటే సెలబ్రిటీ ఎవరని మల్లారెడ్డి స్వయంగా తానే మల్లారెడ్డి యూనివర్సిటీల బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు. అందుకోసం రూపొందించిన AI వీడియో చాలా కొత్తగా ఉంది. ఇందుకోసం ఆయన టైమ్ ట్రావెల్ చేశారు.

ఈ వీడియోలో టైమ్ ట్రావెల్ చేసే మల్లారెడ్డి.. చాలా మంది గురువులను కలుస్తారు. వారంతా ఆయనకు గొప్ప విద్యాలయం ప్రారంభించమని ఆశీర్వదిస్తారు. విజ్ఞానాన్ని పంచమని గౌతమ బుద్ధుడు చెబితే.. రాజ్యాన్ని నిర్మించే విద్యావంతులని చేయమని చాణక్యుడు… యువతను మేల్కొల్పమని వివేకానందుడు ఆయన్ను ఆదేశిస్తారు. ఆ తర్వాత మథర్ థెరిస్సాను.. మహాత్మాగాంధీని కూడా కలిసినట్లు చూపిస్తారు. చివరకు అబ్దుల్ కలాం.. మంచి సైంటిస్టులను ఇవ్వమని ఆయనకు చెబుతారు. చివరకు దేశంలోనే అతిపెద్ద యూనివర్సిటీ స్థాపిస్తానని మల్లారెడ్డి మాట ఇస్తారు ఇలా సాగుతుందీ వీడియో..

మొత్తానికి తన విద్యాసంస్థ ప్రమోషన్ కోసం మల్లారెడ్డి కొత్తగా ప్రయత్నించారు. AIతో రూపొందించినప్పటికీ.. వీడియో క్వాలిటీ బాగుంది. ఇంత మందిని కలిసినట్లు చూపించినా.. ట్రోలింగ్ కు అవకాశం లేకుండా చూసుకున్నారు. ఏ పని చేసిన తనదైన మార్క్ ఉండేలా చూసుకునే మల్లారెడ్డి ఈ విషయంలో కూడా కొత్తగానే ప్రయత్నించారు. రెండు రోజుల క్రితమే తమ విద్యాసంస్థ యూ ట్యూబ్ చానల్‌లో ఈ వీడియోను విడుదల చేశారు. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిట్టిట్యూషన్ పేరుతో ఆయనకు ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్‌మెంట్, డెంటల్, నర్సింగ్ విభాగాల్లో ౩2 విద్యాసంస్థలున్నాయి. 50వేల మందికి పైగా విద్యార్థులు అక్కడ చదువుతుంటారు.




















