22A Lands Issue: కొండల్, తొండల్, అనకొండల్ దందా -22A భూబాధితుల భేటీలో సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
KTR Kondal Reddy land allegations: హైదరాబాద్ తెలంగాణ భవన్లో 22A భూ బాధితులతో కేటీఆర్, హరీశ్‌రావు సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

Revanth Reddy brother land scam BRS: తెలంగాణ భవన్లో సెక్షన్ 22ఏ భూ బాధితులతో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తమ్ముడు.. లెట్స్ డూ కుమ్ముడు అన్న రీతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెట్టాపట్టాల్వేసుకుని రాష్ట్రాన్ని దోచేసుకుంటున్నారని ఆరోపించారు. కొండల్, తొండల్, అనకొండల్ అంటూ రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల కొండల్ రెడ్డి, పొంగులేటి వర్గీయులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో భూ దందాలు, ల్యాండ్ కబ్జాలు పరాకాష్ఠకు చేరాయని, అస్మదీయులకు దోచిపెట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.
తెలంగాణ రాకముందు రియల్ ఎస్టేట్ రంగానికి ఎలాంటి భరోసా లేదని, కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే నీరు, విద్యుత్ సమస్యలను తీర్చి భూముల విలువను ఊహించని స్థాయికి తీసుకెళ్లారని కేటీఆర్ గుర్తుచేశారు. ఒకప్పుడు ఎకరం రూ. 5 లక్షలు ఉన్న భూమి కేసీఆర్ హయాంలో రూ. 50 లక్షలకు పెరిగిందని, దీంతో ప్రజలు భూమిపై పెట్టుబడులు పెట్టేందుకు ధైర్యంగా ముందుకు వచ్చారని తెలిపారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో భూమి కనిపిస్తే బుక్క పెట్టు.. జాగా కనిపిస్తే పాగా వేయ్ అనే చందంగా దందాలు నడుస్తున్నాయని విమర్శించారు. గాంధీల పేరు చెప్పుకుని రాష్ట్రాన్ని ఏలుతున్న లీడర్లు గజదొంగల్లా మారారని ఆరోపించారు.
రాష్ట్రంలో అధికారికంగా ఒక రెవెన్యూ వ్యవస్థ ఉంటే.. తెరవెనుక అదృశ్య శక్తులతో కూడిన మరో సమాంతర రెవెన్యూ సామ్రాజ్యం నడుస్తోందని కేటీఆర్ సంచలన ఆరోపణ చేశారు. ఫైళ్లు ఎవరి ఆదేశాల మేరకు కదులుతున్నాయో, అసైన్డ్ భూములు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. లగచర్లలో తమ అల్లుడికి భూములు కట్టబెట్టడానికి గిరిజనుల పొలాలను గుంజుకున్నారని, హైదరాబాద్ చుట్టూ ఉన్న రూ. వేల కోట్ల విలువైన 10 వేల ఎకరాల భూములపై సీఎం రేవంత్ రెడ్డి కన్ను పడిందని విమర్శించారు. మూసీ ముసుగులోనూ, ఫ్యూచర్ సిటీ పేరుతోనూ పెద్ద ఎత్తున రియల్ దందాకు తెరలేపారని దుయ్యబట్టారు.
కేసీఆర్ హయాంలో కొంగరకలాన్‌కు ఫాక్స్‌కాన్ వంటి దిగ్గజ కంపెనీ తెచ్చి ప్రాంతపు రూపురేఖలు మార్చితే, రేవంత్ రెడ్డి మాత్రం రూ. 200 కోట్ల విలువైన భూమిని తన తమ్ముడికి చెందిన కంపెనీకి కేవలం రూ. 7 కోట్లకే అడ్డికి పావుశేరు లెక్కన కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. రూ. 1,000 కోట్ల మాయాజాలానికి తెరతీసి కొంగరకలాన్ భూములను కాజేసే కుట్ర జరుగుతోందన్నారు. భూములు ఇచ్చేందుకు నిరాకరించిన సామాన్యుల స్థలాలను ఉద్దేశపూర్వకంగానే నిషేధిత జాబితా అయిన 22ఏ కింద పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.
Thammudu ... Lets do Kummudu ...
— Dr.Krishank (@Krishank_BRS) September 11, 2026
Using Megastar Chiranjeevi garu's song,
BRS Working President KTR explains the Land Business CM Revanth , his brother Kondal , Minister Ponguleti are doing with 22 A ... pic.twitter.com/0Feb0dYd2z
గతంలో ధరణి పోర్టల్‌లో బయోమెట్రిక్ వేలిముద్ర పడితే తప్ప అంగుళం భూమి కూడా మారేది కాదని, కానీ నేటి కాంగ్రెస్ భూభారతి అవతారంలో భూముల గోల్మాల్ను యథేచ్ఛగా నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. సెక్షన్ 22ఏ ఆధారంగా ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని అమాయక ప్రజల ఆస్తులను గుంజుకుంటున్న ఈ కుంభకోణంపై ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాధితుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని, ప్రభుత్వం చేస్తున్న ఈ అక్రమాలపై న్యాయపరంగా, ప్రజాక్షేత్రంలోనూ నిలదీస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ట్రెండింగ్ వార్తలు






















