KCR News: ఎర్రవల్లి ఫాం హౌజ్‌కు 9 బస్సుల్లో ప్రజలు - కేసీఆర్‌ను కలిసిన సొంతూరి జనం
KCR In Erravalli Farm House: కేసీఆర్‌ను కలిసేందుకు 9 బస్సుల్లో 540 మంది ఎర్రవెల్లి ఫాం హౌస్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బయటికి వచ్చిన కేసీఆర్ తన సొంతూరు ప్రజలు అందరికీ అభివాదం చేశారు.
Ex CM KCR In Erravalli Farm House: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన సొంతూరు చింతమడక గ్రామస్థులు బుధవారం (డిసెంబరు 6) కలిశారు. మధ్యాహ్నం కేసీఆర్‌ను కలిసేందుకు 9 బస్సుల్లో 540 మంది ఎర్రవెల్లి ఫాం హౌస్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బయటికి వచ్చిన కేసీఆర్ తన సొంతూరు ప్రజలు అందరికీ అభివాదం చేశారు. జై కేసీఆర్.. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలు అక్కడే ఉన్నారు.
ఆయన మీద ఉండే అభిమానం ఎప్పటికీ అలానే ఉంటుంది.#KCR pic.twitter.com/pfSMn7i1UL
— AR (@AshokReddyNLG) December 6, 2023
తొలుత ఎదురు చూపులు
మొదట ఫాంహౌస్ కు వెళ్లిన చింతమడక వాసులకు వేచి చూడడం తప్పలేదు. ఆయన్ని కలిసేందుకు ప్రయత్నించగా బయట సెక్యూరిటీ సిబ్బంది ఆపారు. చాలా సేపు వారు బయటే ఎదురు చూడాల్సి వచ్చింది. తాజా మాజీ ముఖ్యమంత్రి కావడంతో ఫామ్ హౌజ్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అనుమతి లేనిదే లోపలికి పంపమని చెప్పారు. దీంతో లోపలి నుంచి అనుమతి వచ్చేంత వరకు వాళ్లు అక్కడే వేచి చూశారు. ఆ తర్వాత లోపలి నుంచి అనుమతి రావడంతో అందరూ వెళ్లి కేసీఆర్‌ను కలిశారు.
ఇది స్పీడ్ బ్రేకరే - కేటీఆర్
మరోవైపు, సిరిసిల్ల బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్ అని ఆయన్ను ప్రజలు వదులుకోరని కేటీఆర్ స్పష్టం చేశారు. సిరిసిల్లలో ఓటుకు డబ్బులు, మందు పంచనని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని కేటీఆర్ తెలిపారు. ఇది కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని, స్వల్ప కాలం మాత్రమే అని అన్నారు. ఎన్నికల్లో అనుకోని ఫలితాలు రావడం సహజం.. నిరాశ పడాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. తమ పార్టీ పుట్టిందే పోరాటాల నుంచి అని అన్నారు. పోరాటాలు తమకేం కొత్త కాదని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన మాట్లాడతాం అని చెప్పారు. పవర్ పాలిటిక్స్‌లో అధికారం రావడం పోవడం సహజమని అన్నారు. ప్రజలు మనకు కూడా రెండు సార్లు అవకాశం ఇచ్చారని.. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రలో కూడా రాణిస్తామని కేటీఆర్ మాట్లాడారు.