(Source: ECI/ABP News/ABP Majha)
Huzurabad News: నామినేషన్ దాఖలు చేసిన గెల్లు శ్రీనివాస్.. ప్రచారంలో పలువురు నేతల మద్దతు
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8 కాగా, నోటిఫికేషన్ వచ్చిన రోజే టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు.
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేశారు. ఈ మేరకు శుక్రవారం నాడు నామినేషన్ పత్రాలను సమర్పించారు. టీఆర్ఎస్ సీనియర్ నేత, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బి. వినోద్ రావు, హుజూరాబాద్‌కు చెందిన నేత ఇనుగాల పెద్దిరెడ్డి వెంట రాగా హుజూరాబాద్‌లోని ఆర్డీవో కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
ఇవాళ ఉదయం (అక్టోబరు 1) హుజూరాబాద్, ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. ఉదయం 11 నుంచి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8 కాగా, నోటిఫికేషన్ వచ్చిన రోజే టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. కోవిడ్ నేపథ్యంలో నామినేషన్ కేంద్రంలో నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉండగా.. ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ బి వినోద్ రావు, హుజూరాబాద్ నేత ఇనుగాల పెద్దిరెడ్డి వెంట రాగా టీఆర్ఎస్ అభ్యర్థి తన నామినేషన్ వేశారు.
Also Read: TS Assembly: మీ మాటలు వింటే జాలిగా ఉంది.. కేసీఆర్ అసంతృప్తి, అందరికీ అన్ని వివరాలిస్తామని వెల్లడి
మరోవైపు, గెల్లు శ్రీనివాస్‌కు మద్దతుగా టీఆర్ఎస్ నేతల ప్రచారం కొనసాగుతోంది. గెల్లును భారీ మెజార్టీతో గెలిపించాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కోరారు. శుక్రవారం ఆయన జమ్మికుంట పట్టణంలోని 8, 22 వ వార్డుల్లో పర్యటించారు. స్థానిక కాలనీవాసులను కలిసి.. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి.. పరిష్కార మార్గాలు చూపారు. అనంతరం ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ.. జమ్మికుంట అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిధులు కురిపిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లోపు పనులన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గతంలో మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్ ఇక్కడి అభివృద్ధిని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ గుడ్ న్యూస్.. పండగ చేసుకుంటున్న సిబ్బంది?
ఈటల రాజేందర్ బీజేపీలో చేరి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అగౌరవపరిచారని మండిపడ్డారు. ఆయన కుట్రలను భగ్నం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ అండగా నిలవాలని కోరారు. ఆయన వెంట ఆయా వార్డులకు చెందిన కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు.
Also Read: వర్క్ ఫ్రం హోం ఇక ముగిసినట్లే.. ఆఫీసులు తెరవనున్న దిగ్గజ కంపెనీల జాబితా ఇదే..