Bandi Sanjay: సభలో లేని ప్రధానిపై ఆరోపణలా? వారిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్
ప్రజలను మభ్యపెట్టేందుకు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే కేంద్రాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
తెలంగాణలో చేసిన అభివృద్ధి, ప్రజలకు ఇచ్చిన హామీలపై మాట్లాడకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తిట్టడానికే అసెంబ్లీని వేదికగా చేసుకోవడం సిగ్గు చేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. సభలో లేని వ్యక్తిపై ఆరోపణలు చేయడం సభా సాంప్రదాయం కాదని, అయినప్పటికీ ప్రధాని గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడుతుంటే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఏం చేస్తున్నారని బండి ప్రశ్నించారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెట్టేందుకు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే కేంద్రాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు.
దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి
తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. నిరుద్యోగ భ్రుతి, ఫ్రీ యూరియా సహా ఇచ్చిన హామీలపై కేసీఆర్ అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఏసీడీ ఛార్జీల విషయంలో కేసీఆర్ ద్వంద్వ విధానాలు పాటిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలపై ఏసీడీ ఛార్జీల భారం మోపిన కేసీఆర్ ఎంఐఎం నేతలకు భయపడి పాతబస్తీలో ఏసీడీ ఛార్జీల ఊసే ఎత్తలేదన్నారు. తెలంగాణ ప్రజలకు ఒక న్యాయం? పాతబస్తీకి మరో న్యాయమా? అని ప్రశ్నించారు. పాతబస్తీలో ఏటా వెయ్యి కోట్ల కరెంట్ చౌర్యం జరుగుతోందని, నిరూపించేందుకు తాను సిద్దమని ప్రకటించారు. సీఎం కేసీఆర్, ఎంఐఎం నేతలకు చేతనైతే విద్యుత్ శాఖ లెక్కలు తెప్పించుకుని చూడాలని సూచించారు. సచివాలయాన్ని ధ్వంసం చేసినోళ్లే కూల్చే సంస్క్రుతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్న బండి సంజయ్ నిజాం వారసత్వ మరకలను సమూలంగా తుడిచి వేస్తామని, బరాబర్ సచివాలయ డోమ్ లను కూల్చివేస్తామని పునరుద్ఘాటించారు.
అర్హతలేని అధికారులకు రూల్స్ కు విరుద్ధంగా కేసీఆర్ తన తాబేదార్లనే కారణంతో కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రతిపాదనలు పంపారని మండిపడ్డారు. అర్హులైన ఉద్యోగస్తులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని.. ప్రశ్నించకపోతే ఉద్యోగస్తులను బానిసలకంటే హీనంగా చూస్తారని అన్నారు. కేసీఆర్ సర్కార్ అరాచకాలు పెచ్చుమీరాయని, ఆ ప్రభుత్వాన్ని తరిమికొట్టేదాకా విశ్రమించొద్దని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందించడంతోపాటు నిలువనీడలేని పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని, రైతులకు పంట పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. జనం గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన ‘స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ’కు బండి సంజయ్ హాజరై ప్రసంగించారు.
బండి సంజయ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
- ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాలను దెబ్బతీశాడు.. కుల వృత్తులను నాశనం చేస్తున్నాడు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా అబద్దాలతో కాలం వెళ్లబుచ్చుతున్నాడు. కోరుట్ల నియోజకవర్గం అభివ్రుద్ధి చెందాలంటే మార్పు కోరండి. కేసీఆర్ పాలనను తరిమికొట్టండి. అవకాశమిస్తే బీజేపీ ఆధ్వర్యంలో పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.
- కేసీఆర్ పాలన వైఫల్యాలను, వాస్తవాలను ప్రజలు ముందుంచితే జీర్ణించుకోలేకపోతున్నరు. అసెంబ్లీలో అభివ్రుద్ధి గురించి, హామీల గురించి మాట్లాడకుండా బడ్జెట్ సమావేశాల పేరుతో మోదీని తిట్టడం, బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వడం లేదంటూ ప్రజలను మభ్య పెట్టేందుకు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిలిస్తున్నారు.
- కేంద్రం తెలంగాణకు ఎన్ని నిధులిచ్చింది? ఎంత ఖర్చు చేసింది? మీరు చేసిందేమిటి? ప్రజలకు ఏం చేశారో బహిరంగ చర్చకు సిద్ధం. గొల్లకొండ ఖిల్లా మొదలు ఎక్కడికైనా చర్చకు వచ్చేందుకు సిద్దం. అసెంబ్లీలో లేని మోదీపై ఆరోపణలు చేయకూడదనే ఇంగిత జ్ఝానం లేదా? సభా హక్కులను ఉల్లంఘిస్తుంటే స్పీకర్ ఏం చేస్తున్నారు? సభలో లేని ప్రధానిపై ఇష్టానుసారం మాట్లాడిన నేతలపై చర్యలు తీసుకోవాలి.
- ఫ్రీ యూరియా, నిరుద్యోగ భ్రుతి హామీలేమైనయ్. ఎందుకు అమలు చేయలే. ఉద్యోగాల భర్తీకి రూ.5 వేల కోట్లు కావాలి. వెయ్యి కోట్లే ఎందుకు పెట్టినవ్? రుణమాఫీకి రూ.25 వేల కోట్లు అవసరం. 6 వేల కోట్లే ఎందుక పెట్టినవ్. అసెంబ్లీలో వీటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు?
- బడ్జెట్ లో చేనేత బంధు, గిరిజన బంధుకు నిధులు ఎన్ని కేటాయించారో చెప్పకుండా మోదీని తిట్టడమే పనిగా పెట్టుకోవడం సిగ్గు చేటు. మోదీకి, కేసీఆర్ కు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా. ప్రపంచమంతా మోదీని పొగుడుతున్నరు. దొంగ దందాలు చేసే కుటుంబం మీది. లిక్కర్ దందాలో మీ బిడ్డ పాత్ర ఉంది.
- రోగమొస్తే ఆసుపత్రిలో పైసలు కట్టలేక జనం చస్తున్నరు. ఆస్తులు అమ్ముకుంటున్నరు. పిల్లలను చదివిద్దామంటే ఫీజులు కట్టలేని పరిస్థితి. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్య, వైద్యాన్ని అందిస్తాం.. నిలువ నీడలేని పేదలందరికీ పక్కా ఇండ్లు కట్టిస్తాం. దేశంలో కేంద్ర ప్రభుత్వం 3 కోట్లు ఇండ్లు కట్టించింది. తెలంగాణలో 2.4 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం ఒక్కరికీ కూడా ఇల్లు కట్టివ్వలేదు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేసి రూ.5 లక్షల వరకు ఉచితంగా కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తాం. పంట నష్టసోయిన రైతులందరికీ ఫసల్ బీమా కొంద నష్టపరిహారం చెల్లించి ఆదుకుంటాం.
- కేసీఆర్ ఇంట్లో అందరికీ మంత్రి, ఎమ్మెల్సీ, ఎంపీ పదవులిచ్చారు. తెలంగాణ నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగమియ్యకపోవడం సిగ్గు చేటు. కరెంట్, ఆర్టీసీ, రిజిస్ట్రేషన్, నల్లా ఛార్జీలు పెంచి ప్రజలను దోచుకుంటున్నరు.
- ఏసీడీ పేరుతో తెలంగాణాలో కరెంట్ బిల్లులు బాదుతున్న కేసీఆర్ ఎంఐఎం లాంటి ఫాల్తుపార్టీకి భయపడి పాతబస్తీలో ఏసీడీ ఛార్జీల ఊసే ఎత్తడం లేదు. కరెంట్ బిల్లులు వసూలు చేయరు. అధికారులు వెళితే కొట్టి పంపుతున్నారు.
- పాతబస్తీలో రూ.వెయ్యి కోట్ల కరెంట్ చోరీ జరుగుతోంది. దీని గురించి పట్టించుకోరు. నిన్న ఒకాయన పాతబస్తీలో బిల్లుల బకాయిలే లేవని సిగ్గులేకుండా మాట్లాడుతున్నడు. విద్యుత్ నష్టాలు తెలంగాణలో 8 శాతం ఉంటే... పాతబస్తీలో 39 శాతం వరకు ఉన్నాయని విద్యుత్ శాఖ లెక్కలే చెబుతున్నాయి. చేతనైతే ఆ లెక్కలు తెప్పించుకుని చూడు..
- సచివాలయం కూల్చినోళ్లే... ఇయాళ కూల్చే సంస్క్రుతి గురించి నీతులు చెబుతున్నారు. అందులో ఉన్న పోచమ్మ తల్లి గుడిని కూల్చిన మూర్ఖుడెవరు? తెలంగాణ ప్రజలను నరకయాతన పెట్టిన నిజాం ఆనవాళ్లను సచివాలయానికి పెడుతున్నరు. తాజ్ మహల్ వంటి సమాదితో పోలుస్తున్న సచివాలయాన్ని అట్లనే ఉంచుదామా? బరాబర్ సచివాలయం డోమ్ లను కూల్చివేస్తాం... తెలంగాణ సంస్క్రతి, భారతీయ సంస్క్రతి ఉట్టిపడేలా కడతాం... ఎట్టి పరిస్థితుల్లో నిజాం వారసత్వాన్ని, నిజాం నెత్తుటి మరకలను పూర్తిగా తుడిచి వేస్తాం...
- ఉస్మానియా ఆసుపత్రిలో కూలే స్థితిలో ఉంది.. పేదలకు వైద్యం అందించే ఆసుపత్రిని కూల్చడం లేదు. డోమ్ లు ఉన్నయని కూల్చడానికే భయపడుతున్నడు. నిజాం వారసత్వాన్ని చూపడానికే ఇదంతా... ఆసుపత్రి కట్టడం చేతగాని కేసీఆర్ వంద రూములతో ప్రగతి భవన్ కట్టుకున్నడు. పేదలకు ఇండ్లు కట్టడం లేదు?
- అధికారుల నియామకాల్లో కూడా రూల్స్ పాటించరు... వాళ్లకు నచ్చితే అందలం ఎక్కిస్తారు. నచ్చనోళ్లను, బడుగు, బలహీనవర్గాలను తొక్కేస్తారు. లూప్ లైన్ లో పడేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య డిప్యూటీ కలెక్టర్లకు కలెక్టర్లుగా ప్రమోషన్లు ఇచ్చే ప్రతిపాదనల ఆమోదానికి కేంద్రానికి ఫైలు పంపింది. నిజానికి డిప్యూటీ కలెక్టర్ గా కనీసం 8 ఏళ్లపాటు పనిచేసిన వాళ్లు కలెక్టర్ గా ప్రమోషన్ పొందడానికి అర్హులు. కానీ కేసీఆర్ కుటుంబానికి అవన్నీ జాన్తా నై... వాళ్ల దగ్గర చెప్పినట్లు పనిచేస్తే చాలు.. ప్రమోషన్లు ఇస్తున్నారు.
- ఆ ఇంట్లో ఒక మంత్రికి సెక్రటరీగా పనిచేస్తున్న ఎంపీడీఓ స్థాయి మహిళా అధికారిని 4 ఏళ్ల క్రితమే ఎంపీడీఓ సీఈవో చేశారు. నాలుగేళ్లు తిరగకుండానే ఆమె పేరును కలెక్టర్ల ప్రమోషన్ జాబితాలో పెట్టారు. ఇంకో మంత్రి దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్న అధికారిని కూడా కలెక్టర్ జాబితాలో పెట్టారు. ఇట్లాంటోళ్లంతా కలెక్టర్లయితే.... కేసీఆర్ చెప్పిందానికి తలూపుతారు. అవినీతికి గేట్లు బార్లా తెరుస్తారు.
- రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగస్తులారా.... ఆలోచించండి. అర్హులైన ఎంతోమంది అధికారులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నడు. మీ అర్హత, గౌరవ మర్యాదలను తుంగలో తొక్కుతున్నడు. ఇంకా చూస్తూ ఊరుకుంటే... మిమ్ముల్ని కనీసం మనుషులుగా కూడా చూడరు.. బానిసలకంటే హీనంగా చూస్తారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని కోరుతున్నా అని బండి సంజయ్ ప్రసంగించారు.