Sircilla: పదేళ్ల క్రితం సిరిసిల్లలో సంచలన మర్డర్ - ఇప్పుడు ఐపీఎస్ ట్రైనింగ్‌లో పాఠం, కేసులో సినిమాల్ని మించిన ట్విస్టులు
పోలీసులు అనుసరించిన విధానం ప్రతిష్ఠాత్మక నేషనల్ పోలీస్ అకాడమీలో ఈ కేస్ ఇప్పుడు యువ ఐపీఎస్ అధికారులకు కేస్ స్టడీ గా మారింది.
ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్లలో 2011 జూన్‌లో జరిగిన ఓ సంచలన మర్డర్ కేసు ఇప్పుడు హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ లో ఉన్న యువ ఐపీఎస్ లకు పాఠ్యాంశంగా మారింది. మర్డర్ కి గురైన అతని వ్యక్తిగత వివరాల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా నిందితులకు శిక్షపడేలా చేసిన పోలీసు అధికారుల సక్సెస్ స్టోరీని ఇందులో బోధిస్తున్నారు. ఇంతకీ ఆ క్రైమ్ స్టోరీ ఏంటో మీరూ చదవండి.
వలపు వలకు చిక్కాడిలా...
సిరిసిల్ల పట్టణంలోని సుభాష్ నగర్ కు చెందిన ప్రముఖ క్లాత్ బిజినెస్ వ్యాపారి గర్దాస్ శ్రీనివాస్ (42) కి భార్య లలిత ఇద్దరు పిల్లలు సాయి కృష్ణ, శ్రీకాంత్ ఉన్నారు. అయితే, సాధారణ బిజినెస్ వ్యవహారాల్లో భాగంగా సుజాత అనే మహిళ శ్రీనివాస్ కి ఫోన్ లో పరిచయమైంది. కలుద్దాం అంటూ ఆఫర్ ఇచ్చింది. దీంతో శ్రీనివాస్ 2011 జూన్ 20 న హైదరాబాద్ లోని ఉప్పల్ లో గల ఏఆర్కె అపార్ట్మెంట్ కు వెళ్ళాడు. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న ఆరుగురు సభ్యులు గల ఒక గ్యాంగ్ పథకం ప్రకారం అతని కిడ్నాప్ చేసి కుటుంబ సభ్యులను 25 లక్షలు డిమాండ్ చేశారు. భయపడ్డ కుటుంబ సభ్యులు వెంటనే లక్షన్నర వారి బ్యాంకు ఖాతాల్లో వేశారు. అయితే తమను శ్రీనివాస్ చూశాడని భావించిన వారంతా అతను మళ్ళీ గుర్తుపడితే సమస్య ఎదురవుతుందని అదే అపార్ట్ మెంట్లో అతన్ని దారుణంగా మర్డర్ చేశారు. శవాన్ని మూట కట్టి ఫ్రిజ్లో దాచి పెట్టారు .ఈ సంఘటనపై సిరిసిల్ల పోలీసులు క్రైమ్ నంబర్ 173/2011 నమోదు చేశారు.
పక్కా స్కెచ్ ఫ్లాప్ అయింది ఇలా
శ్రీనివాస్ హత్య కేసులో నిజానికి ఎలాంటి ప్రత్యక్ష ఆధారాలు పోలీసులకు దొరకలేదు. దీంతో టెక్నికల్ ఆధారాలను పూర్తిస్థాయిలో సేకరించారు. నిందితులు సెల్ ఫోన్ లో మాట్లాడుకున్న మాటల్ని టవర్ల ఆధారంగా గుర్తించి ముందు కొండరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అతను అపార్టుమెంట్ లోని ఫ్రిజ్‌లో శవం దాచిపెట్టిన విషయాన్ని బయట పెట్టాడు. ఇక మిగిలిన నిందితులంతా భీవండికి పారిపోగా అప్పటి సిరిసిల్ల ఓఎస్డీ ధరావత్ జానకి, ప్రొబేషనరీ డీఎస్పీ శ్రీనివాస్, సిరిసిల్ల టౌన్ సీఐ సర్వర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసును ఛేదించారు. నిందితులైన కొండపాక శ్రీధర్, ఆకులేని ఇందిర, కొక్కుల సుజాత, మెర్గు చిరంజీవి, గూడూరు రాజు, కొండ రాజులకు యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేస్తూ 2017 సెప్టెంబర్ 12న కరీంనగర్ న్యాయస్థానం శిక్ష విధించింది. అయితే చిరంజీవి అనే నిందితుడు అప్పటికే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అప్పటి క్రైమ్ ఇప్పుడు ఐపీఎస్ లకు కేస్ స్టడీ
అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసును ఛేదించడానికి పోలీసులు పూర్తిస్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేపట్టారు. ఏలాంటి క్లూ లేకున్నా మొదటి నుండి మర్డర్ కి గురైన అతని వ్యవహార శైలితో పాటు నిందితుల గురించి వివరాలు సేకరించడం మొదలు పెట్టారు. దొరికిన చిన్న ఎవిడెన్స్ తో మొదలు పెట్టి అన్ని ఆధారాలతో వారికి శిక్ష పడేలా చేసే వరకు పోలీసులు అనుసరించిన విధానం ప్రతిష్ఠాత్మక నేషనల్ పోలీస్ అకాడమీలో ఈ కేస్ ఇప్పుడు యువ ఐపీఎస్ అధికారులకు కేస్ స్టడీ గా మారింది.