Karimnagar: చిలక జోస్యానికి కేరాఫ్ అడ్రస్ ఈ ఊరు, రామ చిలుకకి ట్రైనింగ్ ఎలాగో తెలుసా?
చిలుకలు అంత త్వరగా మనిషి మాట వినవు. అలా వినడానికి ప్రత్యేకమైన శిక్షణ అవసరం ఉంటుంది. ఇక్కడి కుటుంబాల వారికి అలా శిక్షణ ఇవ్వడం వెన్నతో పెట్టిన విద్య.
Karimnagar Parrot Prophecy: కరీంనగర్ జిల్లాలోని పట్టణ కేంద్రానికి సమీపంలోని కొత్తపల్లి మండలంలో ఉంటుంది లక్ష్మీపూర్. పచ్చని పొలాలతో అందంగా ఉండే ఈ గ్రామానికి దేశంలోనే ఒక ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో నివసిస్తున్న దాదాపు 200 మంది కుటుంబాల వారు చిలక జోస్యం చెప్పడమే తమ వృత్తిగా బతుకుతున్నారు. గ్రామంలోని బుడగ జంగాల కాలనీకి చెందిన దాదాపు 200 మంది కుటుంబాలు తమ తరతరాలుగా చిలకజోస్యం పైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. వారి కొత్త తరాన్ని కూడా అదే వృత్తి వైపు మళ్లించడమే కాకుండా వారికి కూడా ఒక ఉపాధి పర్మినెంట్ గా ఉండాలని ప్రిపేర్ చేస్తున్నారు.
ట్రైనింగ్ ఇస్తారు ఇలా...
సాధారణంగా చిలుకలు అంత త్వరగా మనిషి మాట వినవు. అలా వినడానికి ప్రత్యేకమైన శిక్షణ అవసరం ఉంటుంది. ఇక్కడి కుటుంబాల వారికి అలా శిక్షణ ఇవ్వడం వెన్నతో పెట్టిన విద్య. చిలుక చిన్న పక్షిగా ఉన్నప్పుడే దాన్ని తీసుకుని వచ్చి రకరకాల మాటలు అర్థం చేసుకునే విధంగా ట్రైనింగ్ ఇస్తారు. ఇలా కొద్ది రోజులు గడిచే సరికి ఆ చిలుకలు వారు చెప్పినట్లే నడుస్తాయి. దాదాపుగా 200 మంది కుటుంబాలకు ఒక పక్షి జాతి ద్వారా ఉపాధి లభిస్తుంది అంటే నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే.
అయితే కొందరు పక్షి ప్రేమికులు వీరిపై ఫిర్యాదులు ఇవ్వడం వల్ల చాలా వరకూ చిలుకలని జూ, పక్షుల సంరక్షణ కేంద్రానికి అప్పట్లో తరలించినట్లు దీనివల్ల తాము కొంత కాలం వరకు ఉపాధి కోల్పోయినట్లు వారంటున్నారు. నిజానికి తాము వాటిని తమ కుటుంబం లోని చిన్నపిల్లల మాదిరిగా చూసుకుంటామని.. శిక్షణ ఇచ్చే సమయంలో ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడమని అంటున్నారు. తామంతా ముఖ్యమైన పండుగలు ,ఇతర వేడుకల సమయంలో బయటకు వెళ్లి ఆయా ప్రాంతాల్లో కూడా చిలుక జోస్యంచెప్తామని అంటున్నారు. కొన్ని ఊర్ల ప్రజలు తమని ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ చిలుక జోస్యం చెప్పించుకుంటారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వీరు చెప్పే చిలకజోస్యం ఎంత ఫేమస్ అంటే తెలంగాణలోని పలు జిల్లాల నుండే కాకుండా పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్, కర్ణాటక లాంటి ప్రాంతాల నుండి కూడా వివిధ ప్రజలు వీరి వద్దకు వచ్చి మరి చిలక జ్యోతిష్యం చెప్పించుకుంటారంట. ఇక సమ్మక్క సారక్క లాంటి భారీ జాతరల సమయంలో తమకు కనీసం తిండి తినే సమయం కూడా దొరకదని వారంటున్నారు. తాము ఈ వృత్తి ద్వారా రోజుకి రూ.500 నుండి రూ.వెయ్యి రూపాయల వరకు సంపాదించుకొంటామని, ఏదో ఒకటి జోస్యం అంటూ చెప్పి వెళ్లినంత మాత్రాన తమపై గత రెండు వందల సంవత్సరాల నుండి ప్రజలకు బలమైన నమ్మకం కలిగేది కాదని వారు ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.