Huzurabad News: హుజూరాబాద్‌లో ముగిసిన ఛాలెంజ్ డెడ్‌లైన్, చౌరస్తాకు కౌశిక్ రెడ్డి - భారీగా ఉద్రిక్తత, తోపులాటలు
టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటలను హుజూరాబాద్‌లో తాను చేసిన పనులకు సంబంధించి చర్చకు రావాలని సవాలు విసిరిన సంగతి తెలిసిందే.
Huzurabad Politics: హుజూరాబాద్ రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా కేంద్రంగా అక్కడి రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య సవాళ్ల పర్వంలో భాగంగా నేడు ఉదయం 11 గంటలకు కౌశిక్ రెడ్డి ఈటలకు విధించిన డెడ్ లైన్ ముగిసింది. దీంతో కౌశిక్ రెడ్డి శుక్రవారం ఆ ప్రదేశానికి చేరుకున్నారు. ఆయనతో పాటుగా టీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీగా వచ్చారు. కానీ, ఈటల రాజేందర్ మాత్రం రాలేదు.
ఈ క్రమంలోనే హుజూరాబాద్‌లో తీవ్రమైన ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్ బీజేపీ నేతలు పరస్ఫరం రాళ్లు విసురుకున్నారు. ఇంకొంత మంది చెప్పులు విసురుకున్నారు. వారిని అదుపు చేయడానికి అప్పటికే మోహరించిన భద్రతా దళాలు తీవ్రంగా శ్రమించాయి. అంతేకాక, టీఆర్ఎస్ నేతలు ఒక దిష్ఠిబొమ్మను తగలబెట్టే ప్రయత్నం చేయగా, బీజేపీ నేతలు దాన్ని అడ్డుకున్నారు. దీంతో తీవ్రమైన గందరగోళం ఏర్పడింది. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఈటల అనుచరులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జై ఈటల.. జై జై ఈటల అంటూ గట్టిగా అరిచారు. వేర్వేరు ప్రాంతాల నుంచి జనం అంబేడ్కర్ చౌరస్తా వద్దకు వచ్చి టీఆర్ఎస్ నేతలను ఎదుర్కొనే ప్రయత్నం చేశారు.
తోక ముడిచారు - కౌశిక్ రెడ్డి
ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. అభివృద్ధిపై చర్చించే దమ్ము ఆయనకు లేదు కాబట్టి, ఈటల తోక ముడిచి రాకుండా ఉన్నారని అన్నారు.
అయితే, కేవలం మాటలకే పరిమితం కాకుండా టీఆర్ఎస్ నేతలు హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో చర్చల కోసం ఏర్పాట్లు కూడా చేశారు. చర్చా వేదికను కూడా సిద్దం చేసి, అందులో కుర్చీలు వేయించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అంటూ రెండు కుర్చీలతో ఓ వేదికను ఏర్పాటు చేశారు.
తొలుత టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటలను హుజూరాబాద్‌లో తాను చేసిన పనులకు సంబంధించి చర్చకు రావాలని సవాలు విసిరిన సంగతి తెలిసిందే. నేడు చర్చ జరగాల్సి ఉన్న వేళ గురువారం కూడా అంబేడ్కర్ చౌరస్తాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో పరిస్థితులు చేయిదాటకుండా పోలీసులు భారీ ఎత్తున బలగాలను మోహరించారు. గురువారం ఆ ప్రాంతంలో ఘర్షణ తలెత్తింది. అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తలు గురువారం గొడవకు దిగారు. ఇరు వర్గాలు ఇలా బలాబలాలు ప్రదర్శించుకుంటూ కర్రలతో ఘర్షణకు దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
హుజూరాబాద్‌లో అభివృద్ధిపై చర్చకు రండి అంటూ ఈటల రాజేందర్ కు సవాల్ విసురుతున్న ఫ్లెక్సీలు కూడా టీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేశారు. దీనికి ప్రతిగా బీజేపీ నాయకులు కూడా కౌశిక్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు పెట్టారు. మానుకొండలో తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లు రువ్విన ఉద్యమ ద్రోహి కౌశిక్ రెడ్డి అంటూ ఫ్లెక్సీల్లో ప్రస్తావించారు. ఉద్యమకారులకు, ఉద్యమ ద్రోహులకు మధ్య చర్చ ఏంటంటూ ఫ్లెక్సీల్లో నిలదీశారు.