Heavy Rains In Karimnagar And Medak: భారీ వర్షాలకు నీట మునిగిన ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాలు- విద్యాసంస్థలకు గురువారం హాలిడే
Heavy Rains In Karimnagar And Medak: తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా మెదక్, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో జోరు వానకు జనజీవనం స్తంభించిపోయింది.

Heavy Rains In Karimnagar And Medak: ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎక్కడ చూసిన వరద నీరు కనిపిస్తోంది. వాగులు వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అందుకే కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముందస్తు జాగ్రత్తా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు హాలిడే ప్రకటించారు అధికారులు. అవసరం అయితే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దని సూచిస్తున్నారు.
వినాయక చవితి ఆనందం కామారెడ్డి జిల్లాలో లేకుండా చేశాడు వరుణుడు. మంగళవారం సాయంత్ర నుంచి ఎడతెరిపిలేకుండా వాన కురుస్తోంది. ఈ కుండపోత కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయి.లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కామారెడ్డి పట్టణంలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. కనుచూపు మేరలో కూడా రహదారులు కనిపించడం లేదు. యావత్ పట్టణం పెద్ద చెరువును తలపిస్తోంది. చెరువులో భవనాలు కట్టినట్టు ఉంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రహదారులు తెగిపోయాయి. భారీగా ప్రవహిస్తున్న వరదల కారణంగా వచ్చిన నీళ్లు రహదారులను మింగేశాయి. అప్రమత్తమైన అధికారులు రాకపోకలను ఆపేశారు. ఎక్కడి వారు అక్కడే ఉండాలని ప్రయాణాలను పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. బస్‌లు, ఇతర వాహనాలు ప్రమాదకర ప్రాంతాల మీదుగా వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు.
రోడ్డు రవాణా వ్యవస్థే కాకుండా రైలు రవాణా వ్యవస్థ కూడా స్తంభించి పోియంది. భారీ వర్షాలు కారణంగా రైలు ట్రాక్‌లపై భారీగా వరద నీరు చేరింది. దారి కనిపించడం లేదు. దీంతో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా రైళ్లు రద్దు చేశారు. కామారెడ్డి మీదుగా వెళ్లే రెండు రైళ్లు రద్దు చేసిన అధికారులు మరికొన్నింటిని దారి మళ్లించారు. కాచిగూడ-మెదక్, నిజామాబాద్-తిరుపతి వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్టు బులెటిన్ విడుదల చేశారు.
కశ్మీర్- కన్యాకుమారి రహదారి NH44పై భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. హైదరాబాద్ నుంచి నిజామాబాద్, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే వారంతా అక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. నార్సింగి వద్ద హైవేపై భారీగా వరద నీరు చేరింది. దీంతో నేషనల్ హైవే చెరువును తలపిస్తోంది. వాహనాలు వరదలో కొట్టుకుపోయే అవకాశం ఉండటంతో పోలీసులు వాహనాలను సురక్షిత ప్రాంతంలో నిలిపేశారు.
మెదక్ జిల్లాలో వరదల్లో 12 మంది చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి అధికారులతో మాట్లాడి హెలికాప్టర్ పంపించాలని కోరారు. వాతావరణం అనుకూలిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు. ఇప్పటికే కామారెడ్డి DRF బృందాలు మెదక్ చేరుకున్నాయి. హావేలిఘనపూర్ (మం) రాజీపేట తండా వద్ద వాగులో ఆటోలో వెళ్లి 8 మంది చిక్కుకున్నారు. ఆటో కొట్టుకుపోయింది. ప్రాణాలతో బయటపడి ప్రయాణికులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. హావేలి ఘనపూర్ (మం) నాగపూర్ వద్ద వాగులో కారు కొట్టుకుపోయింది. చెట్టుని పట్టుకుని నలుగురు వ్యక్తులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
కుండపోతగా కరుస్తున్న వర్షాలకు కామారెడ్డి జిల్లా ఆర్గొండలో ఎక్కువ వర్షపాతం నమోదు అయింది. మెదక్ జిల్లాలో నాగాపూర్‌లో అత్యధికంగా వర్షపాతం నమోదు అయ్యింది. భారీ వర్షాలు కారణంగా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. ఎక్కడికక్కడ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు.





















