RFCL PM Modi Tour: రెండ్రోజుల్లో ప్రధాని టూర్, రామగుండం ఫ్యాక్టరీలో నిలిచిన ఉత్పత్తి - ఆందోళనలో అధికారులు!
నవంబరు 12న ఆర్ఎఫ్సీఎల్ ను ఈ నెల 12న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్పత్తి ప్రక్రియ నిలవడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది.
ప్రధాని మోదీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించే కార్యక్రమం ఉన్న వేళ కర్మాగారంలో ఉత్పత్తి నిలిచిపోయింది. ఫ్యాక్టరీలోని అమ్మోనియా ప్లాంట్ లో లీకేజీ జరగడం వల్లే బుధవారం రాత్రి నుంచి యూరియా ఉత్పత్తి ఆగిందని కార్మికులు తెలిపారు. నవంబరు 12వ తేదీన (శనివారం) ఆర్ఎఫ్సీఎల్ ను ఈ నెల 12న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్పత్తి ప్రక్రియ నిలవడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఇవాళ సాయంత్రానికల్లా కార్మికులు మరమ్మతులు చేసే అవకాశం ఉంది. మొత్తానికి రేపటి నుంచి ఉత్పత్తిని పున:ప్రారంభించే అవకాశం ఉంది.
3 దశాబ్దాల తర్వాత ప్రధాని ఇక్కడికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీ సభ విజయవంతం చేయడం కోసం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుంచి జనాల్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఎన్‌టీపీసీ పరిశ్రమ శంకుస్థాపన సమయంలో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్, ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో మరో కార్యక్రమానికి ప్రధానులు హాజరయ్యారు. ఆ తర్వాత దాదాపు 30 ఏళ్ల తర్వాత ప్రధాని అధికారిక పర్యటనకు వస్తున్నారు.
రామగుండం పర్యటనలో భాగంగా ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసిన అనంతరం ప్రధాని మోదీ బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఆ సభలో వ్యవసాయం, రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు, ప్రయోజనాలను ప్రధాని నరేంద్ర మోదీ వివరించనున్నట్లు తెలుస్తోంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 ఏళ్ల కాలంలో దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం వివిధ రంగాల్లో తీసుకొచ్చిన విధానాలు, తద్వారా పొందిన ఫలితాలను కూడా మోదీ వివరిస్తారు.
1999లో మూసివేత
బొగ్గుతో నడిచే రామగుండం ఎరువుల కర్మాగారాన్ని నష్టాలు వచ్చాయని 1999లో మూసివేశారు. ఎఫ్‌సీఐ స్థానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో గ్యాస్ ఆధారితంగా ఆర్‌ఎఫ్‌సీఎల్ ను నిర్మించారు. 2015 ఫిబ్రవరి 17న ఆర్‌ఎఫ్‌సీఎల్ ఏర్పడగా, 2015 మార్చి 11న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి సెప్టెంబర్ 25న నిర్మాణ పనులు ప్రారంభించారు. 2016 ఆగస్టు 7న ప్రధాని మోదీ ఈ ప్లాంట్ కోసం మెదక్ జిల్లా గజ్వేల్ లో శంకుస్థాపన చేశారు. 2018 డిసెంబర్ నాటికి ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయాలని అనుకున్నారు. మొత్తానికి నిర్మాణ పనులు పూర్తి చేసి 2021 మార్చిలో ట్రయల్ రన్ చేశారు.
వాటాదారులు ఆరుగురు
ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు తెలంగాణ సర్కారు వాటాదారుగా ఉంది. 26 శాతం నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్), 26 శాతం ఇంజినీర్స్ ఇండియా లిమిడెట్ (ఈఐఎల్), 11 శాతం ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్‌సీఐఎల్), 11 శాతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, 11.7 శాతం డెన్మార్క్ దేశానికి చెందిన హల్దార్ టాప్స్ కంపెనీ, 14.3 శాతం గ్యాస్ సరఫరా చేసే గెయిల్ సంస్థకు వాటాలు ఉన్నాయి. 6 బ్యాంకులు లోన్ ఇస్తుండగా, వీటన్నింటికీ ఎస్‌బీఐ నోడల్ ఏజెన్సీగా ఉంది.
ఈ ఎరువుల ఫ్యాక్టరీ నుంచి ఎరువులు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రకు సరఫరా అవుతాయి. దాని ద్వారా రోడ్లు, రైల్వే, అనుబంధ పరిశ్రమలు బలోపేతం అవుతాయి. ఈ రాష్ట్రాల్లోని ప్రజలకు చక్కటి ప్రయోజనాలు కూడా చేకూరనున్నాయి.